బీహార్ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. ఇటీవల ఏర్పడిన మహాఘట్ బంధన్ ప్రభుత్వం అసెంబ్లీ బలపరీక్షను ఎదుర్కోవాల్సి ఉంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా రాజీనామా చేశారు. రాజీనామాకు ముందుకు ఆయన దాదాపు 20 నిమిషాల పాటు భావోద్వేగంతో ప్రసంగించారు. ఇంతకు ముందు ప్రభుత్వంలో స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయ్‌కుమార్ సిన్హాను సీఎం రాజీనామా చేయాలని కోరగా.. ఆయన నిరాకరించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం అతనిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది.
తనపై ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంపై ఆవేదన చెందిన విజయ్ కుమార్.. తనపై వచ్చిన ఆరోపణలు ఆమోదయోగ్యం కాదని అన్నారు. కూటమి ఎమ్మెల్యేలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసు అస్పష్టంగా ఉందని, నియమ నిబంధనలు పాటించలేదని తెలిపారు. 'స్పీకర్‌ను అనుమానించి మీరు ఎలాంటి సందేశం పంపుదామని చూస్తున్నారు? ప్రజలే నిర్ణయం తీసుకొంటారు' అని వ్యాఖ్యానించారు. బీజేపీకి చెందిన ఆయన విధాన సభను వాయిదా వేసి గందరగోళనం నడుమ బయటకు వెళ్లారు.
బలపరీక్షకు జేడీయూకు చెందిన నరేంద్ర నారాయణ్ యాదవ్ నేతృత్వం వహించాల్సిందిగా సూచించారు. అదే టైమ్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు కాషాయ కండువాలు ధరించి 'భారత్ మాతాకీజై', 'జైశ్రీరామ్' అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు ఫ్లోర్ టెస్ట్ నేపథ్యంలో భాజపా ఎమ్మెల్యేలు విధాన సభ ముందు నిరసనలు చేశారు.