అరవింద్ కేజ్రీవాల్‌కి బెయిల్.. 104 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు..

ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది

By Medi Samrat  Published on  13 Sep 2024 5:40 AM GMT
అరవింద్ కేజ్రీవాల్‌కి బెయిల్.. 104 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు..

ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. మొదటి పిటిషన్‌పై సీబీఐ అరెస్ట్ చెల్లుబాటు అయ్యేలా కోర్టు పరిగణించింది. రెండో పిటిషన్‌పై తీర్పు వెలువరిస్తూనే.. కేజ్రీవాల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్‌కు రూ.10 లక్షల బెయిల్ బాండ్ స‌మ‌ర్పించాల‌ని ఆదేశిస్తూ ఉపశమనం క‌ల్పించింది.

ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు జులై 12న సుప్రీంకోర్టు బెయిల్ వచ్చింది. దీంతో ఆయ‌న‌ జైలు నుంచి బయటకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. మధ్యంతర బెయిల్ పూర్తయిన తర్వాత.. 104 రోజుల క్రితం అంటే జూన్ 2న ఆయన జైలులో లొంగిపోయారు. తాజా బెయిల్‌తో.. ఈరోజే ఆయ‌న‌ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నమోదు చేసిన అవినీతి కేసులో తన అరెస్టును, ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. కేజ్రీవాల్‌ పిటిషన్లపై ధర్మాసనం సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ కేజ్రీవాల్‌ ను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది.

Next Story