గణతంత్ర దినోత్సవాల్లో మహిళా పైలట్లు.. సరికొత్త చరిత్ర
Bhawana Kanth becomes 1st woman fighter pilot to be part of IAF's tableau. భారత వాయుసేన చరిత్రలో గణతంత్ర దినోత్సవాల్లో తొలిసారిగా ఇద్దరు మహిళా పైలెట్లు పాల్గొన్నారు.
By Medi Samrat Published on 26 Jan 2021 2:04 PM IST72వ భారత గణతంత్ర వేడుకలు న్యూఢిల్లీలోని రాజ్ పథ్ లో ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లు, జాతీయ యుద్ధ వీరుల స్మారక స్థూపాన్ని సందర్శించి, అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు. సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ, తన సందేశాన్ని రాశారు. రాజ్ పథ్ లో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్న ప్రధాని, ఒక్కొక్కరుగా వచ్చిన అతిథులను స్వాగతించారు. రాష్ట్రపతి కాన్వాయ్ రాగానే, ఆయనకు నమస్కరించి, స్వాగతం పలికి, వేదికపైకి తోడ్కొని వెళ్లారు. ఆపై 21 గన్ సెల్యూట్, జాతీయ గీతాలాపన అనంతరం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం సమర్పించారు. ఫ్రాన్స్ నుంచి గత సంవత్సరం ఇండియా దిగుమతి చేసుకున్న రాఫెల్ యుద్ధ విమానాలు తొలిసారిగా గణతంత్ర పరేడ్ లో పాల్గొన్నాయి. ఇవి చేసిన వర్టికల్ చార్లీ విన్యాసాలను అతిథులు చప్పట్లతో స్వాగతిస్తూ తిలకించారు.
ఆర్మీ అధీనంలో ఉన్న టీ-90 ట్యాంకులు, సంవిజయ్ ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆపై 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 32 శకటాలు పరేడ్ లో పాల్గొన్నాయి. వీటిల్లో కరోనా వ్యాక్సిన్ శకటంతో పాటు రామమందిరం శకటం, ఏపీకి చెందిన లేపాక్షీ థీమ్ శకటం అలరించాయి.
122 మంది సైనికులతో కూడిన బంగ్లాదేశ్ సైనికులు కూడా ఈ పరేడ్ లో పాల్గొన్నారు. విదేశీ అతిథి లేకుండా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. 72వ గణతంత్ర దినోత్సవానికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రావాల్సి ఉండగా, కరోనా న్యూ స్ట్రెయిన్ నేపథ్యంలో ఆయన హాజరవ్వకపోవడంతో.. అతిథి లేకుండానే వేడుకలు ముగిశాయి. విదేశీ అతిథి లేకుండా గతంలోనూ మూడుసార్లు.. 1952, 1953, 1966లలో నిర్వహించారు.
ఈ ఏడాది ఎంతో స్పెషల్:
భారత వాయుసేన చరిత్రలో గణతంత్ర దినోత్సవాల్లో తొలిసారిగా ఇద్దరు మహిళా పైలెట్లు పాల్గొన్నారు. ఫ్లైట్ లెఫ్టినెంట్ భావనా కాంత్ (28), ఫ్లైట్ లెఫ్టినెంట్ స్వాతి రాథోర్ (28) ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. భావనా కాంత్ యుద్ధ విమాన పైలెట్ కాగా, స్వాతి రాథోర్ హెలికాప్టర్ పైలెట్. భావనా కాంత్ వాయుసేన శకటంపై దర్శనమివ్వగా, స్వాతి హెలికాప్టర్ తో విన్యాసాలు చేశారు. భారత వాయుసేనలో ఫ్లైట్ లెఫ్టినెంట్ హోదాలో పనిచేస్తున్న భావనా కాంత్ ప్రస్తుతం రాజస్థాన్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె మిగ్-21 బైసన్ యుద్ధవిమానాలు నడుపుతారు. స్వాతి ఎన్సీసీ నేపథ్యం నుంచి వచ్చారు. భావనా బీహార్ లోని దర్భంగా ప్రాంతం నుంచి వచ్చారు. స్వాతి స్వస్థలం రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లా. గతంలో ఏ మహిళా పైలెట్ కు రిపబ్లిక్ డే పరేడ్ లో ఫ్లై పాస్ట్ నిర్వహించే అవకాశం రాలేదు.