ఇవాళ భారత్ బంద్..ఏ రంగాలపై ఎఫెక్ట్ అంటే?
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు ఇవాళ బంద్ పాటిస్తున్నాయి.
By Knakam Karthik
ఇవాళ భారత్ బంద్..ఏ రంగాలపై ఎఫెక్ట్ అంటే?
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు ఇవాళ బంద్ పాటిస్తున్నాయి. ఈ సమ్మెలో 25 కోట్ల మందికిపైగా కార్మికులు పాల్గొననున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్‌ఈడబ్ల్యూ, ఏఐసీసీటీయూ, లేబర్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్(ఎల్‌పీఎఫ్), యూటీయూసీ కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి
కార్మికుల డిమాండ్లు ఇవే..
కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. 17 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని గత సంవత్సరం కార్మిక సంఘాలు కేంద్రానికి సమర్పించినా అర్థవంతమైన స్పందన లేదని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. గడచిన దశాబ్ద కాలంలో భారతీయ కార్మిక సదస్సు నిర్వహించకపోవడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కార్మిక సంఘాలను బలహీనపరిచి, పని గంటలను పెంచడానికి ఉద్దేశించిన కొత్త కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగాలను, ప్రైవేటీకరణను విస్తరించడాన్ని వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగ నియామకాలు, వేతనాల పెంపు పట్ల నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తున్నాయి. నిరుద్యోగిత, కార్మికుల భద్రతపై కార్యాచరణ కోసం డిమాండు చేస్తున్నాయి.
ఈ రంగాలపై బంద్ ఎఫెక్ట్..
కార్మికుల భారత్ బంద్‌తో బ్యాంకింగ్, ఆర్థిక సర్వీసులు, పోస్టల్ సర్వీసులు, బొగ్గు గనులు, పరిశ్రమలు, రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని రవాణా సర్వీసులు, ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ ప్రభుత్వ శాఖలపై ప్రభావం చూపనున్నది. బ్యాంకు యూనియన్లు విడిగా సమ్మె నోటీసు ఇవ్వనప్పటికీ ప్రభుత్వ, సహకార బ్యాంకుల ఉద్యోగులు బంద్‌లో పాల్గొంటారని యూనియన్ల నిర్వాహకులు ప్రకటించారు. కొన్ని ప్రాంతాలలో బ్యాంక్ కార్యకలాపాలు, చెక్ ప్రాసెసింగ్, ఖాతాదారునికి సేవలకు అవాంతరాలు ఏర్పడే అవకాశం ఉంది. పాఠశాలలు, కళాశాలలు పనిచేసే అవకాశం ఉన్నప్పటికీ రవాణాలో అవాంతరాలు ఏర్పడవచ్చు. ప్రైవేట్ ఆఫీసులు పని చేసినా రవాణా సమస్యల కారణంగా హాజరు తగ్గవచ్చు. ప్రభుత్వ బస్సులు, ట్యాక్సీలు, యాప్ ఆధారిత క్యాబ్‌లు అనేక నగరాలలో నిరసనలు, రాస్తారోకోల కారణంగా అవాంతరాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. రైల్వే కార్మిక సంఘాలు సమ్మె ప్రకటన చేయనప్పటికీ రైల్వే ట్రాకులు, స్టేషన్ల వద్ద నిరసనల కారణంగా రైలు సర్వీసులు ఆలస్యంగా నడిచే అవకాశం ఉంది.