పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులైన భగవంత్ మాన్ మార్చి 16న స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ స్వగ్రామమైన ఖట్కర్ కలాన్‌లో కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. "నేను గవర్నర్‌ను కలిశాను, మా ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందజేశాను. ప్రభుత్వ ఏర్పాటుకు హక్కును పొందాను. ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఎక్కడ నిర్వహించాలనుకుంటున్నామో చెప్పమని ఆయన నాకు చెప్పారు. అది స్వగ్రామంలో జరుగుతుంది. మార్చి 16 మధ్యాహ్నం 12.30 గంటలకు భగత్ సింగ్ గ్రామం ఖట్కర్ కలాన్‌లో జరుగుతందన్నారు.
భగవంత్ మాన్ 'మునుపెన్నడూ తీసుకోని చారిత్రాత్మక నిర్ణయాలు' తీసుకుంటామని వాగ్దానం చేశాడు. "పంజాబ్‌లోని ఇళ్ల నుండి ప్రజలు వేడుకకు వస్తారు. వారు కూడా భగత్ సింగ్‌కు నివాళులర్పిస్తారు. మనకు మంచి మంత్రివర్గం ఉంటుంది. చరిత్రాత్మక నిర్ణయాలు, గతంలో ఎన్నడూ చేయనివి తీసుకోబడతాయి. కాబట్టి మీరు వేచి ఉండండి." అని అన్నారు. శుక్రవారం మొహాలీలో జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో 48 ఏళ్ల మాన్‌ను ఆప్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. మాన్ తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఆహ్వానించారు. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ 92 స్థానాలను గెలుచుకుంది.