దీదీకి కాస్త రిలీఫ్ దక్కినట్లేనా..!

Bhabanipur Bypoll. ఈనెల 30న జరగాల్సిన భవానీపూర్ ఉపఎన్నికపై స్టే ఇచ్చేందుకు కోల్‌కతా హైకోర్టు నిరాకరించింది

By Medi Samrat  Published on  28 Sep 2021 11:00 AM GMT
దీదీకి కాస్త రిలీఫ్ దక్కినట్లేనా..!

ఈనెల 30న జరగాల్సిన భవానీపూర్ ఉపఎన్నికపై స్టే ఇచ్చేందుకు కోల్‌కతా హైకోర్టు నిరాకరించింది. దీంతో మమతా బెనర్జీకి ఊరట లభించింది. ఎన్నికలు యథాప్రకారం జరిపేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. రాజ్యాంగపరమైన అనివార్యత, పశ్చిమబెంగాల్ ప్రత్యేక విజ్ఞప్తి మేరకు భవానీపూర్ ఉప ఎన్నిక నిర్వహణకు ఎన్నికల కమిషన్ అనుమతించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. పోల్ ప్యానల్‌కు పశ్చిమబెంగాల్ చీఫ్ సెక్రటరీ హెచ్‌కే ద్వివేది రాసిన లేఖపై కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ లేఖను కోర్టు ప్రస్తావిస్తూ భవానీపూర్‌లో ఎన్నికల నిర్వహణకు ఎందుకు నిర్ణయించాల్సి వచ్చిందని ఈసీని ప్రశ్నిచింది.

భవానీపూర్ ఉప ఎన్నిక నిర్వహించకపోతే రాజ్యంగ సంక్షోభం తలెత్తుతుందని కమిషన్ ఎలా నిర్ణయించిందని ఈసీని కోర్టు ప్రశ్నించింది. కొందరు వేరెవరో ఆ సీటు నుంచి గెలిచేందుకు వీలుగా తాము గెలిచిన స్థానాన్ని కొందరు వదులుకుంటారు. అలాంటప్పుడు ఎన్నికల ఖర్చు ఎవరు భరిస్తారు అని కోర్టు ప్రశ్నించింది. ఉప ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని వేసిన పిటిష‌న్‌ను కోల్‌క‌తా హైకోర్టు కొట్టివేసింది. ఉప ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేయ‌బోమ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. అయితే ఎన్నికల వ్యయంపై తదుపరి విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది.

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమి చవిచూశారు. అయినప్పటికీ ఆమె ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ పదవిలో ఆమె కొనసాగాలంటే అక్టోబర్‌ లోపు ఆమె ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది.


Next Story