బెంగళూరులోని పురాతన ఆలయాలలో ఒకటైన, చోళుల కాలం నాటి సోమేశ్వర స్వామి ఆలయంలో వివాహ వేడుకలను నిర్వహించడం ఆపివేశారు. ఈ నిర్ణయం తీసుకోడానికి ముఖ్య కారణం పూజారులు ఆలయంలో పూజలు నిర్వహించడం కంటే విడాకుల కోసం కోర్టులో ఎక్కువ సమయం గడుపుతున్నారు. వేలాది జంటలు ఒక్కటైన ఆలయంలో గత ఆరు నుండి ఏడు సంవత్సరాలుగా వివాహ వేడుకలను అనుమతించడం ఎందుకు ఆపివేసిందనే దానిపై భక్తులలో గందరగోళం ఉంది. విడాకుల కేసుల పెరుగుదల కారణంగా, ఆ వివాహాలకు సాక్షులుగా ఉన్న పూజారులు కోర్టు గదుల చుట్టూ తిరగాల్సి వచ్చింది.
ఈ నిర్ణయాన్ని ఇటీవలే బహిరంగంగా ప్రకటించిన ఆలయ పరిపాలన విభాగం, పెరుగుతున్న చట్టపరమైన వివాదాలను నివారించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా నివేదికలు సూచిస్తున్నాయి. 12వ శతాబ్దానికి చెందిన, శివుడికి అంకితం చేయబడిన హలసూర్ సోమేశ్వర ఆలయం, నగరంలో హిందూ వివాహాలకు చాలా కాలంగా పవిత్ర వేదికగా ఉంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న హలసూర్ (ఉల్సూర్) పరిసరాల్లో ఉన్న ఈ ఆలయం, ఏటా వందలాది జంటల పెళ్లి వేదికగా నిలిచేది.