బెంగళూరు నగరంలో కరోనా టెన్షన్..!
Bengaluru Corona Cases. కర్ణాటక రాజధాని బెంగళూరు కరోనా కేసుల విషయంలో అధికారులను, ప్రజలను టెన్షన్ పెడుతూ ఉంది.
By Medi Samrat Published on 23 April 2021 1:44 PM GMTభారతదేశంలోని ఎన్నో నగరాల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. చాలా ప్రాంతాల్లో కరోనా కట్టడికి అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరు కరోనా కేసుల విషయంలో అధికారులను, ప్రజలను టెన్షన్ పెడుతూ ఉంది. బెంగళూరు నగరంలో అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్నాయి. రెండు రోజుల క్రితం వరకు పూణెలో అత్యధిక కేసులు నమోదయ్యాయి.. ఇప్పుడు బెంగళూరు నగరం ఆ లిస్టులో ముందుకు వచ్చింది.
బెంగళూరు నగరంలో 1,37,813 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి. 15 వేల మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మిగిలినవారు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. కర్ణాటక రాష్ట్ర వ్యా ప్తంగా గురువారం 25,795 మందికి కొవిడ్ నిర్దారణ అయింది. బెంగళూరులో 15,244 మంది, తుమకూరులో 1231, బళ్ళారిలో 940, మైసూరు 818, హాసన్ 689, కలబుర్గిలో 659, రాయచూరు 583, బెంగళూరు గ్రామీణ 405 మంది, బీదర్ 396 మంది నమోదయ్యారు. రెండు జిల్లాలు మినహా మిగిలిన 22 జిల్లాల్లోనూ వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 5624 మంది కోలుకున్నారు. 123 మంది మృతి చెందారు. బెంగళూరు నగరంలో మాత్రమే 68 మంది మరణించారంటే పరిస్థితి ఎంతటి దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 1,96,236 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరు నగరంలోనే 1,37,813 మంది ఉన్నారు.