పొట్టచేతపట్టుకుని ఉపాధి కోసం బెంగుళూరు వెళ్లిన ముగ్గురు కూలీలు చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా 1000 కి.మీ నడిచి తమ స్వగ్రామానికి చేరుకున్నారు. కాలినడకన నడిచిన ఒడిశాలోని కోరాపుట్ చేరుకున్నా ముగ్గురు కార్మికుల దయనీయ గాథ ఇది. ఒడిశాలోని కలహండి జిల్లా తింగల్కన్ గ్రామానికి చెందిన బుడు మాజీ, కతర్ మాజీ, బికారీ మాజీ మధ్యవర్తి ద్వారా బెంగళూరులోని ఓ సంస్థలో ఉద్యోగంలో చేరారు. అయితే పని చేయించుకోవడమేగాక, జీతం ఇవ్వకుండా కంపెనీ యజమానులు వారిని తరచూగా కొట్టేవారు. రెండు నెలలుగా పనిచేసినా జీతాలు ఇవ్వలేదు. దీంతో ఆ కార్మికులు గట్టిగా నిలదీసేసరికి వారిని కంపెనీ యాజమాన్యం బయటకు గెంటి వేసింది.
తిరిగి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే వారి చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. దీంతో ముగ్గురూ మంచినీళ్ల బాటిళ్లను మాత్రమే తీసుకుని వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ ఇంటికి కాలినడకన బయలుదేరారు. దారి పొంట వెళ్లేవారు.. వారి బాధాకరమైన కథ విని సహాయం చేసారు. కొంత ఆహారం అందించారు. మరికొందరు కొంత దూరం వరకు రవాణా సౌకర్యం కల్పిస్తారు. చాలా శ్రమ తర్వాత వారం రోజుల తర్వాత ఒడిశాలోని కోరాపుట్ చేరుకున్నారు. ఇక వారి ఆరోగ్యం కూడా మునుపటి కంటే మరింత దిగజారింది. కోరాపుట్‌లో వారిని చూసిన స్థానికులు కొందరు, వారికి ఆహారం, కొంత డబ్బు ఇచ్చి స్వగ్రామానికి పంపించారు.