బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ డ్రైవర్ సోమవారం యశ్వంత్‌పూర్ సమీపంలో బస్సు నడుపుతుండగా గుండెపోటుతో విషాదకరంగా మరణించాడు. బీఎంటీసీ డిపో 40లో పనిచేస్తున్న కిరణ్ (39) అనే వ్యక్తికి నెలమంగళ నుంచి యశ్వంత్‌పూర్‌కు బస్సు నడుపుతుండగా అకస్మాత్తుగా తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చి స్పృహ కోల్పోయాడు. బస్సు ఇంటీరియర్ కెమెరాలోని ఫుటేజీలో డ్రైవర్ అపస్మారక స్థితిలో పడిపోయినట్టు కనిపించింది. అదే సమయంలో బస్సు ముందు వెళ్తున్న మరో బస్సుకు తగులుకుంటూ వెళ్లింది.
వేగంగా ఆలోచించిన కండక్టర్ కదులుతున్న బస్సును అదుపులోకి తీసుకుని సురక్షితంగా నిలిపివేసి, ఘోర విపత్తును నివారించాడు. కిరణ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కండక్టర్ చర్యలను బీఎంటీసీ అధికారులు కొనియాడారు. గత ఏడాది సెప్టెంబరులో విడుదల చేసిన ఆరోగ్య విశ్లేషణలో 45-60 ఏళ్ల మధ్య వయసున్న 7,635 మంది BMTC ఉద్యోగుల్లో 40% మందికి పైగా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని జయదేవ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ వెల్లడించింది.