ముఖ్యమంత్రులను మోదీ అవమానించారు : మమతా
Bengal CM Mamata Fire on PM Modi.భారత ప్రధాని నరేంద్ర మోదీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
By తోట వంశీ కుమార్ Published on 20 May 2021 5:05 PM ISTభారత ప్రధాని నరేంద్ర మోదీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రులను సమావేశానికి పిలిచి అవమానించారంటూ మమతా బెనర్జీ ఆరోపించారు. గురువారం నిర్వహించిన మీటింగ్ లో ముఖ్యమంత్రులు మాట్లాడడానికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదని మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ఎప్పటి లాగే ఈ సమావేశం కూడా సూపర్ ఫ్లాప్ అయ్యిందని అన్నారు. ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశమే రాలేదని.. కేవలం బొమ్మల్లాగా తయారయ్యామని.. డిక్టేటర్ షిప్ నడుస్తోందని విరుచుకుపడ్డారు.
'మోదీ సమావేశానికి మేము హాజరయ్యాము.. కేవలం బొమ్మల్లా కూర్చుని ఉన్నామంతే..! ఒక్కరికి కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. ప్రజల డిమాండ్స్ ను ఎలా ప్రధానికి తెలియజేయగలం..? మేమేమీ బానిసలము కాదు.. ఈ సమావేశానికి హాజరవ్వడం వలన అవమానం పాలయ్యాయి. మోదీ ముఖ్యమంత్రుల మాటలను వినాలని అనుకోవడం లేదు. ఎందుకు భయపడుతూ ఉన్నారు.' అని మమతా బెనర్జీ మోదీ సమావేశంపై వ్యాఖ్యలు చేశారు. ప్రజలు చనిపోతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం పెద్ద పెద్ద బిల్డింగ్ లు కట్టడానికి సిద్ధమైంది.. వ్యాక్సిన్లు, ఆక్సిజన్ల గురించి ఎవరైనా ప్రశ్నలు వేస్తే ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందోనని ఆయన భయపడుతూ ఉన్నారు అని మమత విమర్శించారు.
కరోనా కట్టడి వ్యూహాలపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల జిల్లా కలెక్టర్లతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించారు. అందులో కొన్ని రాష్ట్రాల సీఎంలూ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధాని, కొందరు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తప్ప వేరే రాష్ట్రాల సీఎంలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని మమత ఆరోపించారు. సమావేశంలో భాగంగా వ్యాక్సిన్ల గురించిగానీ, రెమ్ డెసివిర్ మందులపైగానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆమె మండిపడ్డారు. పెరిగిపోతున్న బ్లాక్ ఫంగస్ కేసుల గురించీ వివరాలు అడగలేదన్నారు మమత. తాను కరోనా టీకాల కొరత గురించి నిలదీద్దామని అనుకున్నా నోరెత్తనివ్వలేదని.. దేశంలో కరోనా కొత్త కేసులు తగ్గుతున్నాయన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందు కూడా ఇలాగే కేసులు తగ్గాయన్నారని, కానీ, ఆ తర్వాత కేసులు విపరీతంగా పెరిగాయని అన్నారు.