పార్లమెంట్‌లో పాలస్తీనాకు మద్దతుగా నినాదాలు చేయడం ద్వారా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని వేసిన పిటిషన్‌పై విచారణకు హాజరుకావాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని ఉత్తరప్రదేశ్ కోర్టు ఆదేశించింది. పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత పాలస్తీనాకు మద్దతు పలికినందుకు ఒవైసీపై న్యాయవాది వీరేంద్ర గుప్తా పిటిషన్ దాఖలు చేశారు. ఐదుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన రాజ్యాంగ, చట్టపరమైన విశ్వాసాలను ఉల్లంఘించారని గుప్తా తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
అసదుద్దీన్ ఒవైసీ కోర్టుకు హాజరు కావాల్సిందిగా బరేలీ కోర్టు సమన్లు జారీ చేసింది. పార్లమెంట్‌లో జై పాలస్తీనా అనే నినాదానికి చెందిన అంశంపై ఒవైసీపీ కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. విచారణను 2025 జనవరి 7న జరపనున్నట్టుగా తెలిపింది. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో ఒవైసీ హైదరాబాద్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మాధవి లత కొంపెల్లాపై 3,38,087 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అసదుద్దీన్ పాలస్తీనాకు మద్దతుగా నినాదం చేశారు.