దేశంలో పెరిగిన స్త్రీ శిశువుల రేటు
Baby Girl Rate Increase In India. దేశంలో ఆడపిల్లల సంఖ్య పెరుగుతోందని తాజాగా గణాంకాలు చెబుతూ ఉన్నాయి.
By Medi Samrat Published on 24 Jan 2021 9:15 PM ISTదేశంలో ఆడపిల్లల సంఖ్య పెరుగుతోందని తాజాగా గణాంకాలు చెబుతూ ఉన్నాయి. 2014–2015తో పోలిస్తే 2019–2020లో పురుడుపోసుకుంటున్న పిల్లల లింగ నిష్పత్తిలో (సెక్స్ రేషియో ఎట్ బర్త్– ఎస్ఆర్బీ) వారి సంఖ్య కొంచెం పెరిగిందని తాజా నివేదికల్లో స్పష్టంగా తెలుస్తోంది. 2014–2015లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిల జననంతో పోల్చితే 918 మంది అమ్మాయిలు పుట్టగా.. ఇప్పుడది 934కు పెరగడం విశేషం.
శనివారం నాడు హెల్త్ మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తో కలిసి చేసిన సర్వే వివరాలను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. 2015 జనవరిలో ప్రవేశపెట్టిన 'బేటీ బచావో.. బేటీ పఢావో' కార్యక్రమంతో ఆడపిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతోందని శనివారం నాడు హెల్త్ మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ చెబుతోంది.
దేశవ్యాప్తంగా ఉన్న 640 జిల్లాల్లో 422 జిల్లాలు ఎస్ఆర్బీ విషయంలో మెరుగయ్యాయని చెప్పింది. 2014–15లో ఆడపిల్లలు అత్యంత తక్కువగా ఉన్న జిల్లాల్లో భారీ పెరుగుదల కనిపించిందని పేర్కొంది. ఉత్తరప్రదేశ్ లోని మౌలో వెయ్యి మంది అబ్బాయిలకు 694 మందే ఆడపిల్లలు ఉండగా ఇప్పుడా సంఖ్య 951కి పెరిగిందని తెలిపిందని ఇది ఒక ఉదాహరణ అని తెలిపారు.
ఒకప్పుడు ఆడబిడ్డ పుడితేనే శాపం అని.. పెంచి పోషించడం ఎలా అంటూ పురిట్లోనే కడతేర్చే తల్లిదండ్రులు ఉండేవారు. మారుతున్న కాలంతో పాటూ.. మనుషుల్లోనూ మార్పులు వస్తూ ఉన్నాయి. చదువుకున్న యువత ఆడపిల్లలను, మగపిల్లలను కూడా సమంగా చూడడం మొదలైంది.