కర్నాటకలోని యాద్గిర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. లంచం ఇస్తేనే ఆపరేషన్ చేస్తా అంటూ ఓ డాక్టర్ బరితెగించాడు. కుటుంబసభ్యులు రూ.10 వేలు లంచం ఇచ్చేంత వరకు సి-సెక్షన్ సర్జరీ చేసేందుకు వైద్యుడు నిరాకరించడంతో తల్లి కడుపులోనే శిశువు మృతి చెందిన ఘటన సంచలనం రేపింది. దీంతో జిల్లా యంత్రాంగం గైనకాలజిస్టును శుక్రవారం సస్పెండ్ చేసింది. యాద్గిర్ జిల్లా ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ పల్లవి పూజారి సస్పెండ్ అయిన వైద్యురాలు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక గృహిణి సంగీత గురువారం జిల్లా ఆస్పత్రికి డెలివరీ కోసం వచ్చింది. తనకు సిజేరియన్ సర్జరీ చేసేందుకు డాక్టర్ పల్లవి రూ.10వేలు లంచం అడిగింది. డబ్బులు లేని సుజాత కుటుంబీకులు బంధువులు, స్నేహితుల వద్ద డబ్బులు సమకూర్చేందుకు బయలుదేరారు. ఆమెకు డబ్బు చెల్లించిన తర్వాత మాత్రమే ఆమె శస్త్రచికిత్స చేసింది. అయితే ప్రసవం ఆలస్యం కావడంతో కడుపులోనే బిడ్డ మృతి చెందింది.
గైనకాలజిస్ట్ నిర్లక్ష్యమే పాప మృతికి కారణమని కుటుంబీకులు, బంధువులు ఆరోపించారు. ఆసుపత్రి ఆవరణలో నిరసన తెలిపారు. జిల్లా కమీషనర్ ఆర్. స్నేహల్ నివేదిక అందుకున్న తర్వాత డాక్టర్‌ను సస్పెన్షన్‌లో ఉంచారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.