అయోధ్యలో నిర్మించ తలపెట్టిన రామ మందిరం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా ఘనంగా విరాళాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఇక ఈ విరాళాల సేకరణ ముగిసింది. 44 రోజుల పాటు సాగిన ఈ విరాళాల సేకరణ శనివారంతో ముగిసిందని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. రామ మందిరం కోసం రూ.2 వేల కోట్ల పైగానే విరాళాలు వచ్చాయని ట్రస్టు వర్గాలు తెలిపాయి. ఇంకా చాలా నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉందని.. ఆ ప్రక్రియ పూర్తయితే విరాళాల మొత్తం పెరిగే అవకాశముందని ట్రస్టు సభ్యులు అంటున్నారు.
విరాళాల ద్వారా అందిన మొత్తం నగదుకు ఆడిట్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉందని ట్రస్టు కార్యాలయం ఇన్చార్జి ప్రకాశ్ గుప్తా తెలిపారు. అందుకోసం ఓ యాప్ ను కూడా రూపొందించామని, ఈ ప్రక్రియలో పాల్గొనేవారు ఐడీ, పాస్ వర్డ్ తో లాగిన్ అయి, ప్రతిరోజూ డేటాను యాప్ లో పొందుపరచాల్సి ఉంటుందని అన్నారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్ర బడ్జెట్ లో అయోధ్య రామజన్మభూమిలో నిర్మిస్తున్న రామాలయ అభివృద్ధి, అలంకరణ కోసం రూ.640 కోట్లు కేటాయిస్తూ ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ 2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అయోధ్య రామాలయానికి, అయోధ్య ధామానికి వెళ్లేందుకు అప్రోచ్ రోడ్డు వేయనుంది. దీని కోసం రూ.640 కోట్లలో రూ.300 కోట్లు కేటాయించింది. ఇక అయోధ్య నగర అభివృద్ధి కోసం మరో రూ.140 కోట్లు కేటాయించింది.