కోట్లాది ప్రజల నిరీక్షణకు తెరదించుతూ అయోధ్యలో అపురూప రామ మందిరం ఆవిష్కృతం అయ్యింది. జయజయ ధ్వానాల మధ్య బాల రాముడు ఆలయంలో కొలువు దీరాడు. ప్రధాని మోదీ చేతలు మీదుగా అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. ఈ సమయంలో అయోధ్య రామ నాయ స్మరణతో మారు మోగింది. మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది. ప్రధాని మోదీ స్వామివారికి పట్టువస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. రామలల్లా విగ్రహం దగ్గర పూజలు చేశారు.
రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా అయోధ్య నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. నగరమంతా రామ్ లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రేపటి నుంచి నీల మేఘ శ్యాముడు భక్త జన కోటికి దర్శనం ఇవ్వనున్నారు. ఈ అద్భుత కార్యానికి దేశ, విదేశాల్లోని ప్రముఖులు, స్వామీజీలు కలిపి దాదాపు 7 వేల మంది విచ్చేశారు.