కరోనా సెకండ్ వేవ్‌లో అత్యంత ఇబ్బంది కర పరిస్థితిని ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో దేశ రాజధాని ఢిల్లీ ఒకటి. ప్రతిరోజూ వేలాది కేసులతో పాటు వందల సంఖ్యలో మరణాలతో హస్తిన వణికిపోతోంది. అంతే కాదు కరోనా పేషెంట్లు ఆస్పత్రికి వెళ్లాలంటే అంబులెన్స్ కోసమే గంటలు గంటలు ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో టర్న్ యువర్ కన్సర్న్ ఇన్ టూ యాక్షన్ సంస్థ మరియు రాజ్యసభ సహకారంతో ఆటో అంబులెన్స్‌లను సిద్ధం చేసారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కొవిడ్ పేషెంట్లను ఈ ఆటోరిక్షాల్లో ఆసుపత్రులకు చేరుస్తారు.
ఈ ఆటోలు పూర్తిగా శానిటైజ్ చేసినవి ఇంకా వీటిలో ఆక్సిజన్ ను కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఈ ఆటో అంబులెన్స్ సంఖ్యను భవిష్యత్తులో మరింత పెంచేందుకు ప్రయత్నిస్తామని టీవైసీఐఏ సంస్థ తెలిపింది. స్వల్ప లక్షణాలు ఉండి, 85 నుంచి 90 మధ్య ఆక్సిజన్ స్థాయి ఉంది బయటి నుంచి ఆక్సిజన్ సపోర్ట్ అవసరమైన కోవిడ్ రోగులకు ఈ ఆటో అంబులెన్స్ లు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఈ ఆటో రిక్షలో ఆక్సిజన్ సిలిండర్, శానిటైజర్ కూడా ఉంచారు. ఈ ఆటోలను నడిపే డ్రైవర్లు పీపీఈ కిట్లు ధరిస్తారు. వీటిని బుక్ చేసుకోవడానికి రెండు ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఇలాంటివి మరో 20 ఆటో అంబులన్స్ లు ఢిల్లీలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.