రాముడు సీతతో కలిసి మద్యం తాగేవాడు: కేఎస్‌ భగవాన్‌

Author KS Bhagwan made controversial comments that Rama used to drink alcohol with Sita. హిందూ దేవుళ్లను లక్ష్యంగా చేసుకుని.. తాజాగా ప్రముఖ రచయిత, హేతువాది కేఎస్‌ భగవాన్‌

By అంజి  Published on  22 Jan 2023 4:07 AM GMT
రాముడు సీతతో కలిసి మద్యం తాగేవాడు: కేఎస్‌ భగవాన్‌

హిందూ దేవుళ్లను లక్ష్యంగా చేసుకుని.. తాజాగా ప్రముఖ రచయిత, హేతువాది కేఎస్‌ భగవాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. రాముడిని టార్గెట్‌గా చేసుకుని కొత్త వివాదానికి తెరలేపారు. శ్రీరాముడు ప్రతిరోజు మధ్యాహ్నం తన భార్య సీతతో కూర్చుని వైన్ తాగేవాడని 'వాల్మీకి రామాయణం' చెబుతోందని కాంట్రవర్సీ కామెంట్స్‌ చేశాడు. వాల్మీకి రామాయణంలోని ఉత్తర కాండలో దీని గురించి ఉందని వ్యాఖ్యానించాడు. ''మధ్యాహ్నం సీతతో కూర్చుని ద్రాక్షారసం సేవించడం రాముడి ప్రధాన కార్యకలాపం. ఇది నేను చెప్పడం లేదు. వాల్మీకి రామాయణ పత్రాలు చెబుతున్నాయి'' అని రచయిత చెప్పాడు.

జనవరి 20, 2023న కర్ణాటకలోని మాండ్యాలో జరిగిన కార్యక్రమంలో భగవాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రచయిత భగవాన్.. శ్రీరాముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. 2019 లో కూడా రచయిత వాల్మీకి రామాయణం ప్రకారం.. రాముడు మత్తు పదార్థాలు తీసుకునేవాడని, సీతను కూడా తిసుకునేలా చేశాడని వ్యాఖ్యానించాడు. ఇది అప్పట్లో పెద్ద వివాదానికి దారితీసింది. 'రామ మందిర యాకే బేడ' అనే పుస్తకంలో కూడా భగవాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

కేఎస్‌ భగవాన్ వ్యాఖ్యలపై కొన్ని హిందూ సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. రచయిత నివాసం వెలుపల 'పూజ' చేయడానికి ప్రయత్నించాయి. కేఎస్‌ భగవాన్‌ నివాసం వెలుపల ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. అప్పట్లో కువెంపునగర్‌లోని భగవాన్ నివాసం వెలుపల కేఎం నిశాంత్ నేతృత్వంలోని హిందూ సంస్థ పూజలు చేసేందుకు ప్రయత్నించింది. హిందూ దేవుళ్లపై రచయిత చేసిన ప్రకటనలు "సమాజం శాంతికి భంగం కలిగించాయి" అని కేఎం నిశాంత్‌ అన్నారు.

"వాల్మీకి రామాయణంలోని చివరి అధ్యాయమైన ఉత్తర కాండలోని శ్లోకాలను భగవాన్ తన 'రామ మందిర యాకే బేడ' పుస్తకంలో పేర్కొన్నప్పటికీ, వాల్మీకి ఈ అధ్యాయాన్ని వ్రాయలేదని మేము నమ్ముతున్నందున హిందువులు ఉత్తర కాండతో ఏకీభవించరని ఆయన తెలుసుకోవాలి. రామాయణంలో మొత్తం 24,000 శ్లోకాలు, ఉత్తర కాండ ప్రస్తావన లేదు" అని నిశాంత్ అన్నారు. భగవాన్‌ వ్యాఖ్యలు సమాజంలో అశాంతిని నింపేలా ఉన్నాయని హిందూ సంఘాలు విమర్శిస్తున్నాయి. వాల్మీకి రామాయణంలోని ఉత్తర కాండను వాల్మీకి రాసినట్లు రుజువులు లేవని వారు చెప్తున్నారు.

Next Story