ఇక‌పై ఆగ‌స్టు 14ను అలా జ‌రుపుకుందాం.. ప్ర‌ధాని మోదీ

August 14 to be observed as Partition Horrors Remembrance Day PM Modi.ఇక‌పై ఆగ‌స్టు 14వ తేదీని విభజన భయానక జ్ఞాపకాల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Aug 2021 8:29 AM GMT
ఇక‌పై ఆగ‌స్టు 14ను అలా జ‌రుపుకుందాం.. ప్ర‌ధాని మోదీ

ఇక‌పై ఆగ‌స్టు 14వ తేదీని విభజన భయానక జ్ఞాపకాల దినంగా(Partition Horrors Remembrance Day) గుర్తించ‌నున్న‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తెలిపారు. దేశ విభ‌జ‌న వ‌ల్ల క‌లిగిన బాధ‌ల‌ను ఎన్న‌టికీ మ‌రిచిపోలేమ‌ని ప్ర‌ధాని చెప్పారు. అందుక‌నే ల‌క్ష‌లాది ప్ర‌జ‌ల క‌ష్టాలు, త్యాగాల‌ను గుర్తు చేసుకుంటూ ఆగ‌స్టు 14న విభ‌జ‌న విభజన భయానక జ్ఞాపకాల దినంగా జ‌రుపుకొందామ‌ని ప్ర‌ధాని శ‌నివారం ట్విట‌ర్ ద్వారా తెలిపారు.

'విభజన బాధల్ని ఎప్పటికీ మర్చిపోలేం. భార‌త్‌, పాక్ విభ‌జ‌న‌తో లక్షల మంది మన సోదర సోదరీమణులు తరలిపోవాల్సి వచ్చింది. చాలా మంది అప్పట్లో జరిగిన హింసలో ప్రాణాలు కోల్పోయారు. అప్పటి మన ప్రజల బాధలు, త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆగస్ట్ 14ను మనం పార్టిష‌న్ హార‌ర్స్ రిమెంబ్రెన్స్ డే జరుపుకుందాం' అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఈ స్మృతి దినం ఏక‌త్వ స్పూర్తిని నింపాల‌న్నారు. సామాజిక సామ‌ర‌స్యం, మాన‌వ సాధికార‌త మ‌రింత బలోపేతం కావాల‌ని మోదీ తెలిపారు.

భారత్ కు స్వాతంత్ర్యం ఇచ్చే ముందు బ్రిటీష్ పాలకులు అఖండ భార‌తావ‌నిని రెండు ముక్కలుగా చేశారు. పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా మార్చారు. అప్పట్లో ఈ నిర్ణయం చాలా మందికి నచ్చలేదు. ఈ విభజన సమయంలో ఇండియాలో చాలా మంది పాకిస్తాన్‌కీ, పాకిస్తాన్‌లో చాలా మంది ఇండియాకీ వలస వచ్చారు. ప్ర‌జ‌లు వారి ప్రాంతాల‌కు వెలుతున్న త‌రుణంలో కొన్ని హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్న‌ట్లు కొంత మంది చెబుతారు.

ఇదిలా ఉంటే.. ఈ రోజుని పాకిస్థాన్ త‌న స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్న‌ది. ఈ నేప‌థ్యంలో అత్తారి-వాఘా బోర్డ‌ర్ వ‌ద్ద పాకిస్థాన్ రేంజ‌ర్లు, బోర్డ‌ర్ సెక్యూర్టీ ఫోర్స్ స్వీట్లు పంచుకున్నారు. బీఎస్ఎఫ్ కమాండెంట్ జస్బీర్ సింగ్ మాట్లాడుతూ.. రేపు మన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూడా వారికి స్వీట్లు బహుమతిగా ఇస్తామని చెప్పారు. 1947 ఆగస్ట్ 14న అఖండ భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయింది. దీంతో పాకిస్థాన్ మన కంటే ఒక్కరోజు ముందుగానే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటారు.

Next Story
Share it