Video: విమానం కూలిన ప్రాంతంలో కీలక డివైజ్ లభ్యం
అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిరిండియా విమానం శిథిలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్ (DVR) లభించింది.
By Knakam Karthik
విమానం కూలిన ప్రాంతంలో కీలక డివైజ్ లభ్యం
అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిరిండియా విమానం శిథిలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్ (DVR) లభించింది. ప్రమాద స్థలానికి చేరుకున్న గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు దీనిని స్వాధీనం చేసుకున్నారు. ‘ఇది ఒక డీవీఆర్. దీనిని మేం శిథిలాల నుంచి స్వాధీనం చేసుకున్నాం. ఫోరెన్సిక్ ల్యాబ్ బృందం ఇక్కడికి వస్తుంది’ అని ఏటీఎస్ అధికారి మీడియాతో అన్నారు. అయితే విమాన శిథిలాల్లో లభించిన డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్)ను పరిశీలించిన తర్వాత ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం గురించి కొంత సమాచారం తెలిసే అవకాశముంది. ఫోరెన్సిక్ అధికారులు దాన్ని పరీక్షించాక పూర్తి వివరాలు తెలుస్తాయని ఏటీఎస్ అధికారులు వెల్లడించారు.
కాగా, గురువారం లండన్ వెళ్లేందుకు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానం కొన్ని క్షణాల్లోనే ఎత్తు కోల్పోయి మెడికల్ కాలేజీ బిల్డింగ్‌పై కూలిపోయి పేలిపోయింది. భారీగా మంటలు, పొగలు వ్యాపించాయి. ఆ విమానంలో ఉన్న 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందిలో కేవలం ఒక ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. దిగ్భ్రాంతి కలిగించిన ఈ విమాన ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.