అస్సాంలో తీవ్ర ఎండలు.. స్కూళ్ల పనివేళల్లో మార్పులు
అస్సాంలో ఇప్పుడు చాలా చోట్ల తీవ్రమైన వేడి కారణంగా.. వడగాల్పులు వీస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 21 Sept 2024 3:45 PM ISTఅస్సాంలో ఇప్పుడు చాలా చోట్ల తీవ్రమైన వేడి కారణంగా.. వడగాల్పులు వీస్తున్నాయి. దాంతో.. ఎండ వేడిమి నుంచి పిల్లలను రక్షించేందుకు అస్సాం విద్యాశాఖ పాఠశాలల పని వేళల్లో మార్పులు చేసింది. ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న దిబ్రూఘర్ జిల్లాతో పాటు అన్ని జిల్లాల పాఠశాలలు ఉదయం 8 గంటలకు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం వరకే బడులు పని చేస్తున్నాయి. దాంతో.. విద్యార్థులు ఉదయాన్నే స్కూల్‌కి వస్తున్నారు. యూనిఫామ్ కచ్చితంగా ధరించాలని సూచించారు అధికారులు. కానీ ఉక్కపోత కారణంగా బూట్లు ధరించడంపై మినహాయింపు ఇచ్చారు. మరోవైపు స్కూళ్లలో సరిపడా ఫ్యాన్లు, విద్యుత్ బ్యాకప్ ఏర్పాటు చేయాలని సూచించారు. విపరీతమైన వేడి కారణంగా పిల్లలకు ముందే స్కూళ్లు నిర్వహించడం మంచి విషయమని అంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఉదయం 8 గంటలకు వచ్చినా కూడా ఎండ వేడి ఎక్కువగానే ఉంటోందంటున్నారు.
సెప్టెంబర్ నెలలో ఇలా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం పట్ల ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఈ ఎండలకు కారణం గ్లోబల్ వార్మింగే అంటున్నారు. భూమి చుట్టూ అతినీల లోహిత కిరణాల నుండి రక్షణ కవచంగా పనిచేస్తోన్న ఓజోన్ పొర, గ్రీన్ హౌస్ వాయువుల వల్ల తరిగి పోతోందని అంటున్నారు. గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించే చర్యలను మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. లేదంటే ఎండలు మరింత విపరీతం అవుతూనే ఉంటాయని సూచిస్తున్నారు.