ప్రస్తుతం దేశమంతటా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. ధరల్లో సెంచరీ కొట్టేందుకు పోటి పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో వాహనదారులకు శాంత పరిచేందుకు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై ఏకంగా రూ.5తగ్గించింది. అయితే.. అది మన దగ్గర కాదులెండి అస్సోంలో. ఎందుకంటారా..? ఏం లేదండి త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారుల ఓట్లు దక్కించుకునేందుకు ఈ విధంగా తాయిలాలను ప్రకటించింది.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండంతో.. అసోం ప్రజలపై వరాల జల్లు కురిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని సర్బానంద సోనోవాల్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. అదనపు సెస్‌గా విధిస్తున్న రూ.5 తొలగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం శుక్రవారం రాత్రి నుంచే అమల్లోకి రానుంది. దీనికి తోడు మద్యంపై విధించిన 25 శాతం అదనపు సెస్ కూడా రద్దు చేయాలని నిర్ణయించింది. మార్చి–ఏప్రిల్ లో ఆ రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి కూడా అధికారాన్ని కాపాడుకోవాలన్న పట్టుదలతో ఉంది బీజేపీ. అందుకే ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలు ఆ రాష్ట్రంలో పర్యటించారు. వరాల జల్లు కురిపించారు.
అసోంతో పాటు పొరుగున ఉన్న మేఘాలయ ప్రభుత్వం కరోనాతో తలెత్తిన నష్టాలను భర్తీ చేసేందుకు 2020లో ఇంధనం ధరలు పెంచింది. ఇతర ఈశాన్య రాష్ట్రాలు కూడా ఆర్థిక సంక్షోభం పేరుతో పెట్రోల్, డీజిల్‌పై అదనపు సెస్ విధించాయి. ఇక శుక్రవారం నాడు కూడా ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్ లీటరుకు 29 పైసలు, డీజిల్ 35 పైసలు చొప్పున పెరిగింది.