త్వరలో వందేభారత్ 4.0..కేంద్ర రైల్వే మంత్రి కీలక ప్రకటన
భారతదేశపు సెమీ-హై-స్పీడ్ రైళ్లలో కొత్త వెర్షన్ రాబోతుందని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రకటించారు.
By - Knakam Karthik |
త్వరలో వందేభారత్ 4.0..కేంద్ర రైల్వే మంత్రి కీలక ప్రకటన
భారతదేశపు సెమీ-హై-స్పీడ్ రైళ్లలో కొత్త వెర్షన్ రాబోతుందని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రకటించారు. వందేభారత్ 4.0 అభివృద్ధి చేయను న్నట్లు ఆయన వెల్లడించారు. భారతదేశంలో ప్రస్తుతం సెమీ-హై-స్పీడ్ రైళ్లు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నెక్ట్స్ జనరేషన్ వందే భారత్ లేదా వందేభారత్ 4.0ను అభివృద్ధి చేయనున్నట్లు వైష్ణవ్ ప్రకటించారు. ఎగుమతి గిరాకీలకు అనుగుణంగా దాని రూప కల్పన ఉంటుందని వెల్లడించారు. వందే భారత్ 4,0 అధునా తన సాంకేతికతను మెరుగైన సౌకర్యంతో మిళితం చేస్తుందని తెలిపారు. రైల్వే ఆవిష్కరణలు, ఎగుమతులకు భారతదేశం ఒక కేంద్రంగా మారాలనే ఆశయానికి ఇది మద్దతు ఇస్తుందని అశ్విని వైష్ణవ్ అన్నారు.
వేగవంతమైన, సమర్థవంతమైన ప్రయాణం
భారతీయ రైల్వేలు అపూర్వమైన మైలురాయిలను అధిగమిస్తున్నాయని... గత 11 సంవత్సరాలలో 35,000 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్‌లను నిర్మించామని, 46,000 కిలోమీటర్ల విద్యుదీకరణ చేశామని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఏడాదికి 7,000 కోచ్‌లు మరియు 1,681 లోకోమోటివ్‌లను తయారు చేస్తున్నాయని తెలిపారు. వందే భారత్‌తో పాటు, కేంద్రం ప్రధాన మార్గాల్లో గరిష్టంగా 350 కి.మీ. వేగంతో హై-స్పీడ్ ప్యాసింజర్ రైలు (బుల్లెట్ రైలు కారిడార్లను అభివృద్ధి చేయాలని యోచిస్తోందని, ఇది వేగవంతమైన, సమర్థవంతమైన ప్రయాణాన్ని అందిస్తుందని తెలిపారు.
మొట్టమొదటి బుల్లెట్ రైలు
భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై పురోగతిని ప్రస్తావిస్తూ... 325 కిలోమీటర్ల ట్రాక్ ఇప్పటికే పూర్తయిందని మంత్రి అన్నారు. తాను ఇటీవల సూరత్, బిలిమోరా స్టేషన్లను సందర్శించానని... ఇవి 2027 లో ప్రారంభించబడే మొదటి కార్యాచరణ విభాగంలో భాగం అవుతాయని పేర్కొ న్నారు. భారతదేశంలోని ఆధునిక రైళ్ల సముదాయం కూడా వేగంగా విస్తరించిందని... 156 వందే భారత్ ఎక్స్ ప్రెస్ సేవలు, 30 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు, నాలుగు నమో భారత్ సేవలు ఉన్నాయని తెలిపారు. ఆధునీకరణ ప్రయత్నాల్లో భాగంగా వందే భారత్ 4.0 -సౌకర్యం, వేగం, సాంకే తికతలో ప్రపంచ ప్రమాణాలకు సరిపోయేలా, అధిగమించేలా రూపొందించనున్న నెక్ట్స్ జనరేషన్ రైలు అని పేర్కొన్నారు.