అసెంబ్లీలో పాత బడ్జెట్‌ చదివిన సీఎం.. సభ్యులందరూ షాక్‌

Ashok Gehlot reads old Budget speech for several minutes in Rajasthan Assembly. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ శుక్రవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పిస్తున్న సమయంలో

By అంజి  Published on  10 Feb 2023 3:54 PM IST
అసెంబ్లీలో పాత బడ్జెట్‌ చదివిన సీఎం.. సభ్యులందరూ షాక్‌

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ శుక్రవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పిస్తున్న సమయంలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. సీఎం బడ్జెట్ ప్రసంగాన్ని చదవడం ప్రారంభించారు. అతను సమర్పించే బడ్జెట్ పాతదని గ్రహించడానికి ముందు చాలా నిమిషాలు ప్రసంగం కొనసాగించారు. ఎట్టకేలకు ఆయనను కాంగ్రెస్ మంత్రి మహేశ్ జోషి అడ్డుకుని అసలు విషయం చెప్పారు. గెహ్లాట్ బడ్జెట్‌ పత్రాన్ని చదువుతున్నప్పుడు, అతను గత సంవత్సరం అమలు చేసిన పాత పథకాలు, పట్టణాభివృద్ధి ప్రణాళికలను ప్రస్తావించడం ప్రారంభించారు. అప్పుడే కాంగ్రెస్ నేత మహేశ్ జోషి గెహ్లాట్‌ను అడ్డుకున్నారు. దీంతో సభకు ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పారు.

బడ్జెట్‌ సమర్పణ సందర్భంగా ప్రతిపక్ష బీజేపీ సభ్యులు సభలోకి దూసుకురావడంతో సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. బడ్జెట్ లీక్ అయిందా అని రాజస్థాన్ ప్రతిపక్ష నేత, బీజేపీ నేత గులాబ్ చంద్ కటారియా ప్రశ్నించారు. "ఈ బడ్జెట్‌ను సమర్పించలేము. ఇది లీక్ అయిందా?" అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నాయకురాలు, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరే రాజే గెహ్లాట్‌ను తప్పుబట్టారు. ''నేను సీఎంగా ఉన్నప్పుడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు పదే పదే పరిశీలించి చదివేదానిని. ఒక సీఎం చేతిలో రాష్ట్రం ఎంత సురక్షితంగా ఉందో మీరు ఊహించుకోవచ్చు. పాత బడ్జెట్ చదివాడు'' అంటూ విమర్శించారు. అశోక్ గెహ్లాట్ క్షమాపణ చెప్పాలని గులాబ్ చంద్ కటారియా డిమాండ్ చేశారు.

గెహ్లాట్ కూడా ప్రతిపక్షంపై ఎదురుదాడికి దిగారు. ''నా చేతిలో బడ్జెట్‌లో వ్రాసిన దానికి, సభ సభ్యులకు ఇచ్చిన దాని కాపీలకు మధ్య తేడా ఉంటే మాత్రమే మీరు ఎత్తి చూపగలరు" అని అన్నారు. అతను లీక్ ఆరోపణలను ఖండించారు. అలాంటి ప్రశ్న ఎలా తలెత్తుతుందని అడిగారు. తన బడ్జెట్ కాపీకి పొరపాటున ఒక పేజీ జోడించబడిందని గెహ్లాట్‌ చెప్పారు. సభలో గందరగోళం చెలరేగడంతో సభా కార్యకలాపాలు 30 నిమిషాల పాటు వాయిదా పడ్డాయి. ఈ ఘటనపై అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి క్షమాపణలు చెప్పారు. ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారని అన్నారు. అయితే ప్రతిపక్షాల డిమాండ్‌ మేరకు అసెంబ్లీ కార్యక్రమాల నుంచి ఏదీ తొలగించబోమని ఆయన తెలిపారు.




Next Story