అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్-చైనా సైనికుల మధ్య ఈ నెల 9న జరిగిన ఘర్షణపై పార్లమెంట్ ఉభయసభల్లో చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఆ అంశంపై చర్చ అవసరం లేదని అంటోంది. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తవాంగ్ ఘటనపై పార్లమెంట్‌లో చర్చపెట్టాలని లేదంటే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏం చేయబోతున్నదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సరిహద్దుల్లో భారత సైన్యం బలంగా ఉన్నదని, కానీ వారికి మద్దతు నిలువడంలో ప్రభుత్వం మాత్రం బలహీనంగా ఉందని ఒవైసీ విమర్శించారు. చైనా సేనలు భారత భూభాగంలోకి వచ్చినా.. ఎవరూ రాలేదంటూ ప్రధాని మోదీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అసదుద్దీన్ ఆరోపించారు. చైనా సైనికులు దెప్సాంగ్, దెమ్‌చోక్‌లను ఆక్రమించినట్లుగా శాటిలైట్ చిత్రాలు రుజువు చేస్తున్నాయని ఒవైసీ చెప్పారు. చైనా వాళ్లు భారత భూభాగం ఆక్రమణకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని, భారత ప్రభుత్వం మాత్రం చైనాకు తగిన బుద్ధి చెప్పడంలో విఫలమవుతోందని విమర్శించారు.