ఆర్యన్ ఖాన్ ను కిడ్నాప్ చేయాలని అనుకున్నారట.. షారుఖ్ మాట్లాడాల్సిందే..
Aryan Khan Kidnap-Ransom Plan Ruined By Selfie. మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) జాతీయ ప్రతినిధి నవాబ్ మాలిక్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో
By Medi Samrat Published on 7 Nov 2021 3:00 PM GMTమహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) జాతీయ ప్రతినిధి నవాబ్ మాలిక్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆర్యన్ ఖాన్ 'కిడ్నాప్' కుట్రలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే పాత్ర ఉందని ఆదివారం నాడు ఆరోపించారు. బీజేపీ నేత మోహిత్ భారతీయ కాంబోజ్ ఈ కుట్ర వెనుక ఉన్న సూత్రధారి (మాస్టర్ మైండ్) అని ఆరోపించారు. సబర్బన్ ఓషివారలోని ఓ స్మశాన వాటిక వద్ద మోహిత్ భారతీయను వాంఖడే కలిసారని చెప్పారు. షారూఖ్ ఖాన్ ను కావాలనే మొదట్నుంచీ ఇబ్బందిపెడుతున్నారని, ఆయనపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన అన్నారు. ఆర్యన్ అరెస్ట్ అయిన మొదటి రోజు నుంచి షారూఖ్ కు బెదిరింపులు మొదలయ్యాయని అన్నారు.
క్రూయిజ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి పూజా దడ్లానీ పేరు బయటకు వచ్చినప్పట్నుంచి మాట్లాడొద్దంటూ షారూఖ్ కు బెదిరింపులు వచ్చాయన్నారు. ఇప్పటికైనా షారూఖ్ నోరు విప్పి మాట్లాడాలని, ఆర్యన్ ను కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేశారన్న విషయం చెప్పాలని మాలిక్ అన్నారు. ఆర్యన్ అసలు క్రూయిజ్ టికెట్ కొనలేదన్నారు. ప్రతీక్ గాబా, ఆమిర్ ఫర్నీచర్ వాలా అనే ఇద్దరు ఆర్యన్ ను తీసుకెళ్లారని చెప్పారు. ఈ కేసు పూర్వ విచారణ అధికారి అయిన సమీర్ వాంఖడేతో కలిసి మోహిత్ కంబోజ్ ఆర్యన్ ను కిడ్నాప్ చేశారన్నారు. తర్వాత షారూఖ్ తో డబ్బు బేరం పెట్టాడని సంచలన ఆరోపణ చేశారు. అక్టోబర్ 7వ తేదీ రాత్రి ఓ పార్టీలో వాంఖడేని మోహిత్ కలిశాడని చెప్పారు. క్రూయిజ్ పార్టీకి వెళ్లిన రిషభ్ సచ్దేవా, ప్రతీక్ గాబా, అమీర్ ఫర్నీచర్ వాలాను విడిచిపెట్టారన్నారు.
మోహిత్ కంబోజ్ కు రిషభ్ సచ్దేవా బావమరిదన్నారు. ఆ ముగ్గురిని వదిలేయడంలోనే డ్రగ్స్ కేసంతా దాగుందన్నారు. మహారాష్ట్ర పరువును తీయడానికే ఈ నాటకానికి తెరదీశారని మండిపడ్డారు. ఆరోజు ఫ్యాషన్ టీవీ ఇండియా ఎండీ కషీఫ్ ఖాన్ అదే షిప్ లో ఉన్నా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. క్రూయిజ్ డ్రగ్స్ కేసుతో సహా ఆరు కేసులు ఢిల్లీలోని ఎన్సీబీ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్‌కు శుక్రవారం బదిలీ అయ్యాయి. అయితే ఏజెన్సీ చర్య కేవలం ముంబై, ఢిల్లీ ఎన్‌సీబీ టీమ్‌ల మధ్య సమన్వయ చర్యగా వాంఖడే చెబుతున్నారు. ఆర్యన్ కేసు ఇన్వెస్టిగేషన్ నుంచి తనను తొలగించలేదని ఆయన వివరణ ఇచ్చారు.
సమీర్ వాంఖడే తండ్రి ధ్యాన్‌దేవ్ కచ్రూజీ వాంఖడే, మంత్రి నవాబ్ మాలిక్‌పై రూ.1.25 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యల వల్ల తమ కుటుంబం పరువు పోయిందని ఆరోపిస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తాము మోసం చేసినట్లు ఆరోపించడంతోపాటు హిందువులం కాదంటూ తమ మత విశ్వాసాలను మంత్రి మాలిక్ ప్రశ్నించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. క్రిమినల్ లాయర్ అయిన తన కుమార్తె యాస్మిన్ ప్రాక్టీస్‌ను ఆయన నాశనం చేస్తున్నారని వాంఖడే తండ్రి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే, ఆయన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా, పరువు నష్టం కలిగించే విషయాలను రాయడం, మాట్లాడటం లేదా ప్రచురించడం వంటివి చేయకుండా మంత్రి మాలిక్, ఎన్సీపీ సభ్యులపై శాశ్వత నిషేధం విధించాలని కోర్టునును కోరారు.