విశ్వాస పరీక్షలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నెగ్గింది. గురువారం ఢిల్లీలోని అసెంబ్లీ వేదికగా జరిగిన విశ్వాస పరీక్షలో 58 మంది ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలు ఉన్నాయి. ఇందులో ఆప్ ఎమ్మెల్యేలు 62 మంది కాగా.. బీజేపీకి ఎనిమిది మంది ఉన్నారు.
ఇక విశ్వాస పరీక్షలో విజయం సాధించిన అనంతరం సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్షాలు పన్నిన కుట్ర విఫలమైందన్నారు. ఆప్ ఎమ్మెల్యేలలో ఏ ఒక్క ఎమ్మెల్యేను కొనుగోలు చేయడంలో కూడా బీజేపీ విజయం సాధించలేదన్నారు. తమ పార్టీలోని ఎమ్మెల్యేలు నిజాయతీ పరులని, ఒక్కరు కూడా అమ్ముడు పోరన్నారు. 62 మంది సభ్యుల బలం ఉండగా.. ఇద్దరు విదేశాల్లో ఉన్నారని, ఓ సభ్యుడు జైలు లో ఉన్నట్లు తెలిపారు. మరో సభ్యుడు శాసనసభ స్పీకర్ అని చెప్పారు.
గత కొంతకాలంగా ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆప్‌ను వీడి బీజేపీలో చేరితే ఒక్కొ ఎమ్మెల్యేకు రూ.20 కోట్లు ఆఫర్ చేసినట్లు ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ అసెంబ్లీలో సొంత ప్రభుత్వంపైనే కేజ్రీవాల్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.