ఆ నలుగురిలో ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు.?
మనీష్ సిసోడియా నేడు అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్లనున్నారు. కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన తర్వాత వీరిద్దరి మధ్య ఇదే తొలి భేటీ కావడం విశేషం
By Medi Samrat Published on 16 Sept 2024 12:03 PM ISTమనీష్ సిసోడియా నేడు అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్లనున్నారు. కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన తర్వాత వీరిద్దరి మధ్య ఇదే తొలి భేటీ కావడం విశేషం. కొత్త ముఖ్యమంత్రి పేరుపై ఢిల్లీలో చర్చ జరగనుంది. రెండు రోజుల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నాను అని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రజా తీర్పు ఇచ్చే వరకు నేను సీఎం కుర్చీలో కూర్చోను. నేను, మనీష్ సిసోడియా ప్రజల్లోకి వెళతాం అని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ రద్దు కాదు. నా స్థానంలో మరొకరు సీఎం అవుతారు. తదుపరి సీఎంను ఎన్నుకునేందుకు శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఇందులో సీఎంపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఢిల్లీ ప్రభుత్వ మంత్రి గోపాల్ రాయ్ పేరు ఢిల్లీ తదుపరి సీఎం రేసులో ముందుంది. కైలాష్ గెహ్లాట్ పేరు కూడా ఎక్కువగా వినపడుతుంది. ఈ జాబితాలో ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ పేరు కూడా ఉంది. సీఎం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పేరుపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసి సీఎం ఎవరనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని అరవింద్ కేజ్రీవాల్ చెబుతున్నారు.
ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ సోమవారం విలేకరుల సమావేశంలో సీఎం పేరుపై ఇంకా చర్చ జరగలేదన్నారు. సీఎంగా ఉండగా.. కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాల్సి రావడం ఢిల్లీ చరిత్రలో ఇదే తొలిసారి అని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ఉండాలని ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. సీఎంతో ముఖాముఖి చర్చ జరుగుతుందని.. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజలు కోరుకుంటేనే ఢిల్లీ సీఎం అవుతానని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారని సౌరభ్ భరద్వాజ్ చెప్పారు.
ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు నుండి బెయిల్‌పై విడుదలైన రెండు రోజుల తర్వాత, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. తనపై వచ్చిన అవినీతి ఆరోపణల కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిపై ఆమ్ ఆద్మీ పార్టీలో గుబులు మొదలైంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఈరోజు సోమవారం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి ఆయనను కలవనున్నారు. కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన తర్వాత వీరిద్దరూ భేటీ కావడం ఇదే తొలిసారి.