మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఓ ఆలయంలో పంపిణీ చేసిన ప్రసాదాన్ని ఆరగించిన భక్తుల్లో 70 మంది అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని దుంగార్‌పూర్ జిల్లా అస్పూర్ గ్రామంలో జరిగింది. గ్రామంలోని శివాలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. అదే విధంగా ఈ ఏడాది కూడా ఘనంగా శివరాత్రి వేడుకలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిచి వచ్చి పూజల్లో పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం భక్తులకు ఆలయ అర్చకులు ప్రసాదం పంపిణీ చేశారు.
ఆ ప్రసాదాన్ని తీసుకున్న కాసేపటికే 70 మంది వరకు భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ.. ప్రసాదం తిన్న 70 మంది భక్తులు అనారోగ్యానికి గురయ్యారని.. వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అనారోగ్యానికి గురైన వారి నుంచి శాంపిళ్లను సేకరించి పరీక్షకు పంపించామన్నారు. ఇతర ఆస్పత్రుల నుంచి అదనపు వైద్యులు పిలిపించామన్నారు. ప్రసాదం.. విషపూరితం(పుడ్ పాయిజనింగ్) మారడంతోనే ఇలా జరిగి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.