చొరబాటుకు యత్నించిన చైనా.. తిప్పికొట్టిన ఇండియన్ ఆర్మీ..!
Army Repels Chinese Intrusion In Arunachal Pradesh.కుక్క తోక వంకర ఎలాగో చైనా బుద్ది కూడా అలాగే ఉంటుంది. విస్తరణ
By తోట వంశీ కుమార్ Published on 8 Oct 2021 5:41 AM GMTకుక్క తోక వంకర ఎలాగో చైనా బుద్ది కూడా అలాగే ఉంటుంది. విస్తరణ కాంక్షతో రగిలిపోతూ.. నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మరోసారి భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ యాంగ్సే సమీపంలో చైనా బలగాలు ఎల్ఏసీ(వాస్తవాధీన రేఖ) దాటేందుకు యత్నించగా.. భారత బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అక్కడ మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొనగా.. ప్రొటోకాల్స్ ప్రకారం రెండు దేశాలకు చెందిన స్థానిక కమాండర్లు మధ్య చర్చల అనంతరం పరిస్థితి సద్దుమణిగింది. గతవారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సరిహద్దుల్లో భారత సైనికులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా దాదాపు 200 మంది చైనా సైనికులు ఎల్‌ఏసీకు దగ్గరకు రావడాన్ని గుర్తించారు. చైనా సైనికులు ఎల్ఏసీని దాటేందుకు యత్నించడంతో భారత సైన్యం వారిని దీటుగా అడ్డుకుంది. ఈక్రమంలో ఇరు దేశాల బలగాల మధ్య కొన్ని గంటల పాటు ఘర్షణ చోటుచేసుకుంది. కమాండర్లు మధ్య చర్చల అనంతరం వాస్తవాధీన రేఖ నుంచి వెనక్కి వెళ్లాయి. ఈ ఘటనలో భారత రక్షణ దళాలకు ఎటువంటి నష్టం జరగలేదని స్పష్టమైంది.
అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న వాస్తవాధీన రేఖ వద్ద పలుమార్లు చైనా దళాలు అక్రమంగా చొరబడే ప్రయత్నం చేశాయి. ఆ ప్రాంతంలో అనేకసార్లు ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడింది. గత ఏడాది లడాఖ్‌లో చైనా సైనికులతో ప్రతిష్ఠంభన నెలకొన్న నేపథ్యంలో సుమారు 3500 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ వెంట భారత్ గట్టి పహారా కాస్తోంది. గత ఏడాది పాన్‌గాంగ్ ఏరియా వద్ద ఇరు దేశాలకు చెందిన సైనికుల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే.