భటిండా కాల్పుల ఘటన.. ఆ నలుగురు జవాన్లను కాల్చి చంపిన సైనికుడు అరెస్ట్
పంజాబ్‌లోని భటిండా మిలిటరీ స్టేషన్‌లో జరిగిన కాల్పుల్లో నలుగురు ఆర్మీ సిబ్బంది మరణించిన కొద్ది రోజుల తర్వాత, ఈ ఘటనకు సంబంధించి
By అంజి Published on 17 April 2023 12:00 PM ISTభటిండా కాల్పుల ఘటన.. ఆ నలుగురు జవాన్లను కాల్చింది సైనికుడే
పంజాబ్‌లోని భటిండా మిలిటరీ స్టేషన్‌లో జరిగిన కాల్పుల్లో నలుగురు ఆర్మీ సిబ్బంది మరణించిన కొద్ది రోజుల తర్వాత, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒక జవాన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను భటిండా సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీసు గుల్నీత్ సింగ్ ఖురానా వెల్లడించారు. తొలుత అధికారులను తప్పుదోవ పట్టించిన సైనికుడే.. ఆ నలుగురు జవాన్లను కాల్చి చంపాడని వెల్లడించారు. ఆర్మీ క్యాంప్‌లో గన్నర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మోహన్ దేశాయ్ అనే సైనికుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే నిందితుడు ఈ కాల్పులకు తెగబడ్డాడు. మృతి చెందిన జవాన్లతో ఇతడికి వైరం ఉందని ఎస్‌ఎస్పీ తెలిపారు. ఏప్రిల్ 12న జరిగిన కాల్పుల్లో నలుగురు ఆర్మీ జవాన్లు నిద్రలోనే మరణించారు.
పంజాబ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి నలుగురు జవాన్లను విచారించారు. బటిండా మిలిటరీ స్టేషన్‌లో జరిగిన కాల్పులకు సంబంధించి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాల్పుల ఘటనలో సాక్షి అయిన మేజర్ అశుతోష్ శుక్లా వాంగ్మూలం ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మృతి చెందిన నలుగురు జవాన్లను సాగర్, కమలేష్, సంతోష్, యోగేష్‌లుగా గుర్తించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. డ్యూటీ ముగిసిన తర్వాత వారు తమ గదుల్లో నిద్రిస్తున్న సమయంలో తెల్లటి కుర్తా పైజామాలో ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు రైఫిళ్లు, పదునైన ఆయుధాలతో వారిపై దాడి చేశారు. నలుగురు జవాన్లు వారి గదుల్లో రక్తపు మడుగులో పడి ఉన్నారు.
నేరానికి ఉపయోగించిన ఆయుధాల్లో ఒకదాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆర్టిలరీ విభాగానికి చెందిన నలుగురు ఆర్మీ సిబ్బంది తుపాకీ కాల్పులకు గురై మరణించారు. ఆర్మీ ప్రకటన ప్రకారం.. ఈ సంఘటనలో సిబ్బందికి ఇతర గాయాలు లేదా ఆస్తి నష్టం నివేదించబడలేదు. గత రెండు రోజులుగా INSAS రైఫిల్‌తో పాటు 28 రౌండ్లు తప్పిపోయాయని, ఈ ఘటన వెనుక కొంతమంది సిబ్బంది హస్తం ఉండవచ్చని ఆర్మీ పేర్కొంది. ఈ సంఘటన తరువాత, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. కేసు యొక్క వాస్తవాలను నిర్ధారించడానికి సైన్యం పంజాబ్ పోలీసులతో సంయుక్తంగా దర్యాప్తు జరుపుతోంది. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే నుండి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా సంఘటనపై బ్రీఫింగ్ అందుకున్నారని వర్గాలు తెలిపాయి.