అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సియాంగ్ జిల్లాలోని సింగింగ్ సమీపంలో భారత ఆర్మీ హెలికాప్టర్ శుక్రవారం కూలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రదేశానికి రెస్క్యూ టీమ్‌ను రప్పించారు. ప్రస్తుతం రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. సింగింగ్ గ్రామ సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది. హెచ్‌ఏఎల్ రుద్ర అనే హెలికాప్టర్ సింగింగ్ సమీపంలో కుప్పకూలిన తర్వాత దర్యాప్తు, రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఓ అధికారి తెలిపారు. ట్యూటింగ్ ప్రధాన కార్యాలయానికి 25 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. క్రాష్ సైట్ రోడ్డు ద్వారా వెళ్లడానికి వీలుగా లేదు. దీని వల్ల రెస్క్యూ టీం గాలింపు, రెస్క్యూ కార్యకలాపాలను నిర్వహించడం కష్టతరంగా మారింది.
ప్రమాదం జరిగిన ప్రదేశం చైనా సరిహద్దుకు దగ్గరగా ఉంది. సింగింగ్ గ్రామ సమీపంలో ఉదయం 10:43 గంటలకు ప్రమాదం జరిగినట్లు రక్షణ అధికారులు ధృవీకరించారు. ''ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు లేవు. హెలికాప్టర్‌ను గుర్తించి, ప్రాణాలతో బయటపడిన వారిని కనుగొనే పనిని బృందానికి అప్పగించాం'' అని ఎగువ సియాంగ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జుమ్మర్ బసర్ చెప్పారు.
రుద్ర అనేది భారత సైన్యం కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేత తయారు చేయబడిన వార్ హెలికాప్టర్. ఇది ధృవ్ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ యొక్క వెపన్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ (WSI) Mk-IV వేరియంట్. అక్టోబరు 5న అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సమీపంలోని ఫార్వర్డ్ ఏరియాలో ఎగురుతున్న భారత సైన్యానికి చెందిన చిరుత హెలికాప్టర్ కూలిపోవడంతో ఒక పైలట్ మరణించాడు.