జమ్ములో పేలిన గ్రెనేడ్‌.. ఆర్మీ కెప్టెన్‌, జీసీవో మృతి

Army Captain, JCO killed in grenade blast in Jammu. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో గ్రెనేడ్‌ పేలింది. నియంత్రణ రేఖ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటనలో ఆర్మీ కెప్టెన్‌, జూనియర్‌

By అంజి  Published on  18 July 2022 4:56 AM GMT
జమ్ములో పేలిన గ్రెనేడ్‌.. ఆర్మీ కెప్టెన్‌, జీసీవో మృతి

జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో గ్రెనేడ్‌ పేలింది. నియంత్రణ రేఖ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటనలో ఆర్మీ కెప్టెన్‌, జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ మృతి చెందారు. ఆదివారం అర్ధరాత్రి పూంచ్‌లోని మెంధార్‌ సెక్టార్‌లో ఈ దుర్ఘటన జరిగిందని ఆర్మీ అధికారులు ఇవాళ ఉదయం తెలిపారు. గ్రెనేడ్‌ పేలిన సమయంలో ఇతర సైనికులతో కలిసి ఆర్మీ కెప్టెన్‌తో పాటు నాయబ్‌ సుబేదార్‌ విధులు నిర్వహిస్తున్నారని డిఫెన్స్‌ ప్రతినిధి లెఫ్టినెంట్‌ కల్నల్‌ దేవేందర్ ఆనంద్ తెలిపారు.

ఈ క్రమంలోనే గ్రెనేడ్‌ పేలింది. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని హెలికాప్టర్‌లో ఉధంపూర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఇద్దరూ చికిత్స పొందుతూ మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు. మృతులను కెప్టెన్ ఆనంద్, నాయబ్ సుబేదార్ భగవాన్ సింగ్‌గా గుర్తించారు. విధులు నిర్వహిస్తూ అత్యున్నత త్యాగం చేసిన అధికారులను జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌, వైట్‌ నైట్‌ కార్ప్స్‌కు చెందిన అన్ని ర్యాంకులు ఘన నివాళులర్పించాయి. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపాయి.

మరోవైపు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆదివారం మ‌ధ్యాహ్నం ఉగ్ర‌వాదుల కాల్పుల‌కు బ‌ల‌య్యారు. పోలీసులు, సీఆర్పీఎఫ్ జాయింట్‌ నాకా పార్టీ (చెక్‌పోస్ట్)పై ఉగ్రవాదులు జ‌రిపిన కాల్పుల్లో ఏఎస్సై మరణించారు. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని గోంగూ క్రాసింగ్ సమీపంలో ఈ దాడి జరిగింది. సమీపంలోని యాపిల్ తోట నుండి చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘ‌ట‌న‌లో సీఆర్పీఎఫ్ అధికారి మృతి చెందారు.

Next Story