మీ పిల్లలు సేఫ్ గా ఉన్నారా?
Children safe in Corona time. కరోనా ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
By తోట వంశీ కుమార్ Published on 8 April 2021 10:04 AM ISTసంవత్సరం పాటు పిల్లలని భరించాం.. వారి ఆరోగ్యం కంటే చదువులు ఏమి పెద్ద విషయం కాదనుకున్నాం.. కానీ ఇప్పుడు మన ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయింది. స్కూల్ ఓపెన్ చేసారు కదా, మాస్క్ వేసి పంపిస్తున్నాం, బ్యాగుల్లో శానిటైజర్ పెడుతున్నాం, టీచర్లు కూడా సోషల్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ అని పదే పదే చెబుతున్నారు. ఇంకేం భయం..ఇలా ఆలోచించే పిల్లల్ని ఒంటిపూట అయినా సరే స్కూలుకి పంపిస్తున్నాం.. కానీ మనం చేసేది కరక్టేనా..తెలుసుకోవాలంటే..ఈ వార్త పూర్తిగా చదివండి..తరువాత ఒక నిమిషం ఆలోచించండి.
ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఇంటెన్సివ్ కేర్ చాప్టర్ చేసిన అధ్యయనంలో.. 2000కు పైగా మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ కేసులను గుర్తించారు. అంటే.. కరోనా ప్రభావం వల్ల శరీరంలోని కీలక అవయవాలు వాపునకు గురి కావడం. గుండె, మెదడు, ఊపిరితిత్తుల వంటివి వాపునకు గురై వాటి పనితీరు దెబ్బతింటుంది. కళ్లు ఎర్రగా కావడం, ఒంటిపై దద్దుర్లు రావడం, రక్తపోటు తగ్గిపోవడం, ఎక్కువ జ్వరం, కడుపులో నొప్పి, శ్వాస సమస్యల వంటి లక్షణాలు కనపడతాయి. వీటిని ముందే గుర్తించలేకపోతే ప్రమాదమే. అంతే కాదు కరోనా పాజిటివ్‌గా తేలిన ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరికి ఆస్పత్రిలో చికిత్స అవసరమవుతోందని.. జర్నల్ ఆఫ్ ట్రాపికల్ పీడియాట్రిక్స్ ఫిబ్రవరిలోనే ఒక అధ్యయన నివేదికను ప్రచురించింది.
పోనీ మనం వాక్సిన్ వేసేసుకుంటుంన్నాం కదా అలా వారికి ఒక వాక్సిన్ వేసేస్తే.. ఆలోచన బాగానే ఉంది కానీ పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి కనీసం ఒక ఏడాది పడుతుందని అంచనా. ప్రస్తుతానికి 16 ఏళ్లలోపువారికి ఇవ్వడానికి అవసరమైన అనుమతులు పొందిన వ్యాక్సిన్ ఏదీ లేదు. టీకా వల్ల వారిలో కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకునేందుకు ట్రయల్స్ జరుగుతున్నాయి. యూకేలో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ను చిన్నారులపై ప్రయోగించి, ఫలితాలను చూడాలని భావించినా, ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రక్తం గడ్డ కడుతోందని వచ్చిన వార్తలతో ఆ ప్రయోగాలు ఆగిపోయాయి. యూరప్ లో ఇప్పటివరకూ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకుని, రక్తం గడ్డకట్టిన కేసుల్లో ఏడుగురు మరణించడం కలకలం రేపుతోంది. ఏది ఏమైనప్పటికి పిల్లలు కరోనా బారిన పడకుండా మరింత అప్రమత్తం గా ఉండటం అవసరం.