అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం.. ఏయే ప్రాంతాలపై ప్రభావం చూపబోతోందంటే
Arabian Sea Cyclone. అరేబియా సముద్రంలో రాబోయే కొన్ని రోజుల్లోనే తుపాను ఏర్పడబోతోందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది.
By Medi Samrat Published on 13 May 2021 4:09 AM GMT
అరేబియా సముద్రంలో రాబోయే కొన్ని రోజుల్లోనే తుపాను ఏర్పడబోతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఈ ఏడాది ఏర్పడే తొలి తుపాను అదేనని.. దీనికి మయన్మార్ సూచించిన 'తౌకతీ' అని పేరు పెట్టనున్నారు. ఈ తుపాను ప్రభావం భారతదేశ పశ్చిమ తీరంలో ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతూ ఉన్నారు. ఈ నెల 16 నాటికి తుపాను వస్తుందని అంటున్నారు. ఆగ్నేయ అరేబియా సముద్రంలో 14 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని.. 15న లక్షద్వీప్ కు చేరుకుని 16న తుపానుగా మరింత తీవ్ర రూపం దాలుస్తుందని.. వాయవ్య దిశగా ప్రయాణిస్తూ మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
లక్షద్వీప్, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లో తుపాను ప్రభావం ఉంటుందట..! 17 లేదా 18న తుపాను గమనం మారి కచ్, దక్షిణ పాకిస్థాన్ దిశగా ప్రయాణించే అవకాశం ఉందని అంటున్నారు. గుజరాత్ తీరంపైనా దాని ప్రభావం ఉంటుందని మరో రెండు, మూడ్రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని తెలిపింది.
మరోవైపు నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది మాత్రం కాస్త ముందుగానే రానున్నట్టు ఇస్రో వాతవరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు రుతుపవనాలకు అనుకూలంగా ఉన్నాయని అందుకే ముందస్తు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఆగ్నేయ ఆరేబియా సముద్రంలో శుక్రవారం ఏర్పడే ఆల్పపీడనం కారణంగా తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.