బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఫొటోతో కేటుగాళ్లు నకిలీ రూ.500 నోట్లను ప్రింట్ చేశారు. దానిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బదులు రిసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించారు. నిందితులు ఈ ఫేక్ నోట్లతో 2,100 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా విషయం బయటకు వచ్చింది. నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.1.60 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు అహ్మదాబాద్ పోలీసులు వెల్లడించారు.
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ గుజరాత్‌లో దాదాపు రూ. 1.6 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ నోట్లు బయటపడ్డాయని తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యం , వినోదం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో షేర్ చేసిన వీడియోలో, మహాత్మా గాంధీకి బదులుగా రూ.500 నోట్లపై ఖేర్ ముఖం కనిపిస్తుంది. అహ్మదాబాద్ పోలీసులు నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. అనుపమ్ ఖేర్ అటువంటి వీడియోను షేర్ చేస్తూ, "రూ. 500 నోట్లపై గాంధీజీ ఫోటోకు బదులుగా నా ఫోటో???? ఏదైనా జరగవచ్చు" అని క్యాప్షన్ పెట్టారు.