ఇండియా కూటమికి మరోషాక్.. కేజ్రీవాల్ కీలక ప్రకటన

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్‌ను గద్దె దించేందుకు ఇండియా కూటమి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.

By Srikanth Gundamalla  Published on  10 Feb 2024 5:22 PM IST
india alliance, aap, lok sabha elections ,

ఇండియా కూటమికి మరోషాక్.. కేజ్రీవాల్ కీలక ప్రకటన

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్‌ను గద్దె దించేందుకు ఇండియా కూటమి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఇండియా కూటమి పేరుతో ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి.. మోదీ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూశాయి. మరోవైపు రాహుల్‌గాంధీ ప్రజల్లో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర పేరుతో యాత్ర చేస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా.. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు.

ఇండియా కూటమికికి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా మరో ఎదురుదెబ్బ ఎదురైంది. లోక్‌సభ సీట్ల పంపకాల్లో కూటమిలో వివాదాలు మొదలయ్యాయి. ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్‌ తీరును తప్పుబట్టారు. తాము అడిగనన్ని సీట్లు ఇవ్వకపోవడంతో ఆమె సొంతంగా బెంగాల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక తాజాగా పంజాబ్‌లో కూడా అమ్‌ఆద్మీ పార్టీ ఇండియా కూటమికి షాక్‌ ఇచ్చింది. పంజాబ్‌లోని అన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు. పంజాబ్‌లో ఉన్న మొత్తం 13 లోక్‌సభ స్థానాలు, చండీగఢ్‌లో ఉన్న ఒక స్థానానికి పోటీ చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. అంతేకాదు.. త్వరలో అభ్యర్థులను కూడా ప్రకటించనున్నట్లు తెలిపారు.

పంజాబ్‌లో కాంగ్రెస్‌తో సీట్ల పంపకాలకు ఆప్ వర్గాలు సిద్ధంగా లేవు. సీఎం భగవంత్ మాన్‌ కూడా ఇప్పటికే ఈ అంశాన్ని పలుమార్లు లేవనెత్తారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు బీహార్ సీఎం నితీశ్‌ కుమార్‌ కూడా ఇండియా కూటమికి షాక్‌ ఇచ్చారు. ఆయన ఏకంగా బీజేపీతో చేతులు కలిపి అక్కడ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.


Next Story