రైతులకు గిట్టు బాటు ధర దక్కడం లేదని ఎన్నో ఏళ్లుగా మొరపెట్టుకుంటూ ఉన్నారు. మనిషి సాఫ్ట్ వేర్ లేకపోయినా బ్రతకగలడేమో కానీ.. తిండి లేకపోతే మాత్రం బ్రతకలేడనే విషయాన్ని ఎప్పుడు గమనిస్తాడో..! రైతుల సమస్యలను తమ సమస్యలుగా చాలా మంది భావించడం లేదు. ఎన్నో ఇబ్బందులు పడుతున్న రైతుల విషయంలో సానుభూతి చూపించడం తప్పితే మనం ఏమీ చేయడం లేదు. అన్నదాతల ఆక్రందణలు ఎవరికీ పట్టట్లేదు.
ఎంతో కష్టపడి చెమటోర్చి పండించిన రైతన్నకు గిట్టుబాటు ధర రాకపోవడంతో ఆగ్రహంతో పంటను రోడ్డు మీదనే పడేసి వెళ్ళిపోయాడు. ఇక అది చూసిన జనం ఏరుకోడానికే తెగ కష్టపడిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో జహానాబాద్ టౌన్‌కు చెందిన మహ్మద్ సలీమ్ తనకున్న పొలంలో క్యాలీఫ్లవర్ పంట పండించాడు. పంటను మొత్తం కోసి అమ్ముకోవటానికి పిలిభిత్‌లోని మార్కెట్ యార్డ్‌కు తీసుకువచ్చాడు. కిలో క్యాలీఫ్లవర్ రీటైల్ ధర రూ.12నుంచి రూ.14 ఉంది. సలీమ్ తనకు రూ.8 వచ్చినా చాలనుకున్నాడు. కానీ, అందుకు భిన్నంగా దళారులు కేవలం ఒక రూపాయి మాత్రమే ధర చెల్లిస్తామన్నారు. దీంతో అతడు బాధను తట్టుకోలేక 10 క్వింటాళ్ల పంటను రోడ్డు పాలు చేశాడు.
నాకున్న అర ఎకరం పొలంలో క్యాలీఫ్లవర్స్ పండించానని.. పంట పండించటానికి ఎనిమిది వేల రూపాయలు.. దాన్ని మార్కెట్‌కు తరలించటానికి మరో నాలుగు వేల రూపాయలు ఖర్చు అయిందని చెప్పాడు సలీం. మార్కెట్లో నా పంటకు దారుణమైన రేటు కట్టారు. దీంతో భరించలేకపోయానని.. దానిని ఇంటికి తీసుకొచ్చేంత డబ్బు నా దగ్గరలేకపోవడంతో పంటనంతా రోడ్డు పాలు చేశానని చెప్పాడు. రోడ్డు మీద పడిన తాజా క్యాలీఫ్లవర్స్‌ను సొంతం చేసుకోవటానికి జనం ఎగబడ్డారు.