బిగ్ బికి రాఖీ కట్టిన సీఎం మమతా బెనర్జీ
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం ముంబైలో బచ్చన్ కుటుంబాన్ని కలిశారు. ఆమె అమితాబ్ బచ్చన్‌ను 'భారతరత్న' అని ముద్దుగా పిలిచారు.
By అంజి Published on 31 Aug 2023 6:33 AM IST
బిగ్ బికి రాఖీ కట్టిన సీఎం మమతా బెనర్జీ
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం ముంబైలో బచ్చన్ కుటుంబాన్ని కలిశారు. ఆమె అమితాబ్ బచ్చన్‌ను 'భారతరత్న' అని ముద్దుగా పిలిచారు. తన దృష్టిలో అసలు సిసలు భారతరత్న అమితాబ్ బచ్చనేనని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్‌కి రాఖీ కట్టారు. ఇండియా కూటమి మూడో సమ్మేళనంలో పాల్గొనేందుకు ముంబై వచ్చిన మమతా బెనర్జీ అమితాబ్ బచ్చన్ నివాసాన్ని సందర్శించారు . మమతా బెనర్జీ అమితాబ్ బచ్చన్‌ను భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'గా అభివర్ణించారు. జుహులోని వారి నివాసంలో మమతా బెనర్జీకి అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ నుండి ఘన స్వాగతం లభించింది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, వారి కుమార్తె ఆరాధ్య బచ్చన్ కూడా హాజరయ్యారు. మమతా బెనర్జీ అమితాబ్ బచ్చన్ కుమార్తె శ్వేతా బచ్చన్, మనవరాలు నవ్య నవేలి నందాను కూడా కలిశారు.
Maharashtra | West Bengal CM Mamata Banerjee met Bollywood actors Amitabh Bachchan and Jaya Bachchan at their residence in Mumbai, earlier today. (Source: TMC) pic.twitter.com/PR8A9OPXZf
— ANI (@ANI) August 30, 2023
బచ్చన్ కుటుంబంపై మమతా బెనర్జీ తన అభిమానాన్ని చాటుకున్నారు. "నేను ఈ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. వారు భారతదేశంలో నంబర్ వన్ కుటుంబం, వారు చిత్ర పరిశ్రమకు చాలా కృషి చేసారు" అని మమతా బెనర్జీ అన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా అమితాబ్ బచ్చన్‌కు ఆహ్వానం పంపారు. దుర్గా పూజ, కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో పాల్గొనవలసిందిగా ఆయనను ఆహ్వానించారు. గత సంవత్సరం, అమితాబ్ బచ్చన్ కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు, అక్కడ మమతా బెనర్జీ భారతీయ సినిమా ల్యాండ్‌స్కేప్‌కు చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా అతనికి ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డు ఇవ్వాలని తీవ్రంగా వాదించారు. ఇదిలా ఉంటే.. ఇండియా కూటమి పార్టీలు ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ముంబైలో భేటీ కానున్నాయి. 27 పార్టీలు ఈ సమావేశానికి హాజరు కానున్నాయి.