హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన భారత తొలి చీఫ్ ఆఫ్ డిపెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మదులిక భౌతిక కాయాలను ఢిల్లీలోని వారి నివాసానికి తరలించారు. మరీ కాసేపట్లో వారి అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరగనున్నాయి. కామరాజ్ మార్గ్ నుంచి కంటోన్మెంట్ ప్రాంతం వరకు అంతిమయాత్రను నిర్వహించానున్నారు. సాయంత్రం 4 గంటల వరకు బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
బిపిన్ రావత్ దంపతులకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జోతిరాధిత్య సింధియా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి, కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ తదితరులు బిపిన్ రావత్ దంపతుల పార్థివదేహాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. సీడీఎస్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.