అమరులకు నివాళి అర్పించిన అమిత్ షా
Amit Shah pay tributes to security personnel.ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ చేరుకున్న ఆయన.. అమరవీరుల మృతదేహాలపై పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు.
By తోట వంశీ కుమార్ Published on 5 April 2021 1:26 PM ISTఛత్తీస్‌గఢ్‌లోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు జరిపిన భీకరదాడితో దేశమంతా నివ్వెరపోయింది. సుక్మా-బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని టెర్రాం(బీజాపూర్ జిల్లా) వద్ద శనివారం మావోయిస్టులు అత్యంత వ్యూహాత్మకంగా జరిపిన దాడుల్లో 24 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో కేంద్ర, రాష్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. ప్రతీకారం తప్పదంటూ నక్సల్స్ ను హెచ్చరించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.
సోమవారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ చేరుకున్న ఆయన.. అమరవీరుల మృతదేహాలపై పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. మరి కొద్దిసేపటిలో రాష్ట్ర ఉన్నతాధికారులతో అమిత్ షా సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం కాల్పుల్లో గాయపడి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న జవాన్లను కేంద్ర మంత్రి పరామర్శిస్తారు. కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమిత్ షా బస్తర్ అడవులకు రావడం ఇదే మొదటిసారి. జవాన్లలో ఆత్మస్థైర్యం నింపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అమిత్ షా రాక సందర్బంగా బస్తర్ అడవుల్లో కనీవినీ ఎరుగని భద్రతను ఏర్పాటు చేశారు.
ఈ ఘటనపై సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ మాట్లాడుతూ నిఘా వ్యవస్థ వైఫల్యం ఏమాత్రం లేదని తెలిపారు. మావోయిస్టులపై దాడులకు జవాన్లు రచించిన కార్యాచరణలోనూ లోపాలు లేవని చెప్పారు. సమస్యను ముందుగా గుర్తిస్తే జవాన్లు కూంబింగ్‌కు వెళ్లరని.. ఒకవేళ ఆపరేషన్‌లో వైఫల్యం ఉంటే ఎక్కువ మంది నక్సలైట్లు మరణించేవారు కాదని అన్నారు. సుమారు 25 నుంచి 30 మంది మధ్య మావోయిస్టులు హతమై ఉంటారని కుల్దీప్ సింగ్ తెలిపారు. కాల్పుల నేపథ్యంలో గాయపడిన, మృతిచెందిన వారిని మావోయిస్టులు మూడు ట్రాక్టర్లలో తరలించినట్లు సమాచారం అందిందని ఆయన చెప్పారు.