మమతా బెనర్జీపై అమిత్ షా సెటైర్లు
Amit Shah On Mamata Banerjee's Injury. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. నందిగ్రామ్ ఘటనకు సంబంధించి మమతకు కౌంటర్ వేశారు.
By Medi Samrat Published on 15 March 2021 4:45 PM IST
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాలుకు గాయమైన సంగతి తెలిసిందే..! ఈ గాయం కొందరి దాడి వలన జరిగిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతూ ఉన్నారు. అధికారులేమో ప్రమాదం కారణంగా అని అంటున్నారు. ఇక సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రాణీబంధ్‌లో జరిగిన ఓ ర్యాలీలో వర్చువల్ గా పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. నందిగ్రామ్ ఘటనకు సంబంధించి మమతకు కౌంటర్ వేశారు. నా హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం కారణంగా నాకు ఆలస్యమైంది. కానీ దీనిని కుట్ర అని నేను అనను అని అమిత్ షా అన్నారు. నందిగ్రామ్ ఘటన మమతపై జరిగిన దాడి కాదు అని ఎన్నికల సంఘం కూడా తేల్చిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు. మీ హయాంలో 130 మంది చనిపోయారు. వాళ్ల బాధ ఎంతో మీకు తెలుసా? మీ కాలికి గాయం తగిలిన తర్వాత మీకు నొప్పి తెలుస్తోంది అని షా విమర్శించారు.
ఒకప్పుడు దేశానికి నేతగా ఉన్న పశ్చిమబెంగాల్ ఇప్పుడు గూండారాజ్యమైందని అమిత్‌షా అన్నారు. విద్య, స్వాతంత్ర్య సమరయోధులు, మత నిర్దేశకత్వం పరంగా ఎంతో వెలుగువెలిగిన బెంగాల్ గూండారాజ్ గుప్పిట్లో చిక్కుకుందని షా అన్నారు. బెంగాల్‌ను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లు వెనక్కి తీసుకు వెళ్లిందని ఆరోపించారు. ఈ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్తాం అని అమిత్‌షా అన్నారు. బెంగాల్‌లో తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఝాగ్రాలో పండిట్ రఘునాథ్ ముర్ము గిరిజన్ యూనివర్శిటీ ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులకు అవకాశాలను మెరుగుపరుస్తామని.. 12వ తరగతిలో 70 శాతానికి పైగా మార్కులు సాధించిన గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్య కోసం 50 శాతం ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు.