ఆయుధాలు వీడకపోతే.. ఆలౌట్ ఆపరేషన్ మొదలుపెడతాం: అమిత్ షా
మావోయిస్టులు హింసను విడనాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఆయుధాలు వదిలేసి సరెండర్ కావాలని సూచించారు.
By అంజి Published on 20 Sep 2024 6:06 AM GMTఆయుధాలు వీడకపోతే.. ఆలౌట్ ఆపరేషన్ మొదలుపెడతాం: అమిత్ షా
మావోయిస్టులు హింసను విడనాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఆయుధాలు వదిలేసి సరెండర్ కావాలని సూచించారు. తన ప్రతిపాదనను పట్టించుకోకపోతే నక్సల్స్‌పై ఆలౌట్ ఆపరేషన్ మొదలుపెడతామని అమిత్ షా హెచ్చరించారు. 2026 మార్చి నాటికి నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. న్యూఢిల్లీలో బస్తర్ పీస్ కమిటీ ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాద(ఎల్‌డబ్ల్యుఈ) హింసాకాండ బాధితులతో మాట్లాడిన హోంమంత్రి, హింసను విడనాడాలని, ఆయుధాలు వదులుకుని లొంగిపోవాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు.
నక్సల్స్ హింస, భావజాలాన్ని దేశం నుంచి తుడిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారని అన్నారు. "ఈశాన్య ప్రాంతంలోని మిలిటెంట్లు చేసినట్లుగా హింసను విడనాడాలని, ఆయుధాలు విడనాడి లొంగిపోవాలని నేను నక్సల్స్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు వినకపోతే, ముప్పును అంతం చేయడానికి త్వరలో ఆల్-అవుట్ ఆపరేషన్ నిర్వహించబడుతుంది" అని షా చెప్పారు. ఈ సమస్య ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు జిల్లాలకే పరిమితమైందని, మావోయిస్టులపై జరిపిన ఆపరేషన్లలో భద్రతా బలగాలు గణనీయమైన విజయాన్ని సాధించాయని కేంద్ర హోంమంత్రి చెప్పారు.
ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన 55 మంది మావోయిస్టు బాధితులను ఉద్దేశించి గాంధీనగర్ ఎంపీ అమిత్ షా మాట్లాడుతూ.. మేము ఈ దేశం నుండి నక్సలిజాన్ని, నక్సలిజం ఆలోచనను నిర్మూలించి శాంతిని నెలకొల్పుతాము అని పేర్కొన్నారు. పశుపతినాథ్ (నేపాల్) నుంచి తిరుపతి (ఆంధ్రప్రదేశ్) వరకు కారిడార్ ఏర్పాటు చేయాలని మావోయిస్టులు ఒకప్పుడు అనుకున్నారని, అయితే మోదీ ప్రభుత్వం దానిని ధ్వంసం చేసిందని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంతో సన్నిహిత సమన్వయంతో ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ హింసాకాండ బాధిత ప్రజల కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ త్వరలో సంక్షేమ పథకాన్ని రూపొందించనుంది. "ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణ, ఇతర రంగాలలో మా సంక్షేమ చర్యల ద్వారా మేము మీకు ఏ విధంగానైనా సహాయం చేస్తాము" అని ఆయన చెప్పారు.