దేశంలో కరోనా విజృంభిస్తోంది. కరోనా పెరిగినంతగా ఆసుపత్రుల్లో బెడ్‌లు, ఆక్సిజన్ లు పెరగవు కదా..ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాపై పోరులో భాగంగా రైల్వే శాఖ ఓ అడుగు ముందుకు వేసి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లను నడపనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేగంగా, భారీగా ఆక్సిజన్లను తరలించి, సకాలంలో రోగులకు అందించడమే ఈ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ప్రధాన ఉద్దేశం. ఇవి నడిచేందుకు గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నామని ట్వీట్ చేశారు. . ఈ ట్రైన్లలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఒ), ఆక్సిజన్ సిలిండర్లను రవాణా చేస్తున్నామని అన్నారు.
దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవంతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య సైతం పెరుగుతోంది. కానీ, అందుకు అనుగుణంగా ఆసుపత్రుల్లో పడకలు లేవు. దీంతో అనేక రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు అండగా నిలిచేందుకు దాదాపు 4 వేల రైల్వే బోగీలను రైల్వే శాఖ ప్రత్యేక కొవిడ్ కేర్ ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చింది. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ వాటి ఫొటోలను ట్విట్టర్‌లో పంచుకున్నారు.
ఆయా రాష్ట్రాల డిమాండ్‌ను బట్టి మూడు లక్షల ఐసోలేషన్ బెడ్స్ ఏర్పాటు చేయవచ్చునని వెల్లడించారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ స్టేషన్ 25 కోచ్‌ల్లో, షకూర్ బస్తీ స్టేషన్‌లో 800 బెడ్స్ ఐసోలేషన్ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.