అబార్షన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు
All women entitled to safe and legal abortion Supreme Court.అబార్షన్ల పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది
By తోట వంశీ కుమార్ Published on 29 Sept 2022 1:17 PM ISTమహిళల గర్భస్త్రావాల(అబార్షన్ల)పై గురువారం సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. చట్టపరంగా మహిళలందరికీ సురక్షితంగా అబార్షన్లు చేయించుకునే హక్కు ఉందని దేశ అత్యున్నత న్యాయ స్థానం వెల్లడించింది. వివాహితులు, అవివాహితులు అంటూ తేడా చూపించడం రాజ్యాంగ విరుద్దం అని స్పష్టం చేసింది. పెళ్లితో సంబంధం లేకుండా సురక్షితమైన అబార్షన్ చేయించుకునే హక్కు మహిళకు ఉందని తెలిపింది. పెళ్లి కాని మహిళలు కూడా అబార్షన్ చేయించుకోవచ్చునని పేర్కొంది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్రెన్సీ కేసులో సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది.
"చట్టప్రకారం మహిళలందరికీ అబార్షన్లు చేయించుకునే హక్కుంది. మహిళ వైవాహిక స్థితి కారణంగా ఆమెకు అవాంఛిత గర్భాన్ని తొలగించే హక్కు లేదని చెప్పలేం. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్రెన్సీ(ఎంటీపీ) చట్టం నిబంధనల ప్రకారం పెళ్లైనా, కాకపోయినా గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్ చేయించుకునే హక్కుంది. ఈ విషయంలో వివాహితులు, అవివాహితులు అని తేడా చూపడం నేరం. రాజ్యాంగం ఎదుట అది నిలవజాలదు. వివాహమైన వారిని 24 వారాల లోపు అభార్షన్‌కు అనుమతిస్తూ అవివాహితులను అనుమతించకపోవడం సరికాదు. ఇప్పుడు కాలం మారింది. సామాజిక వాస్తవాలకు అనుగుణంగా నిబంధనలు మారుతుంటాయని" జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
అదే విధంగా భర్త బలవంతంగా శృంగారం చేస్తే అది అత్యాచారమే అవుతుందని చెప్పింది. వైవాహిక అత్యాచార నేరంగా పరిగిణించి..దాని ద్వారా కలిగే గర్భాన్ని కూడా అబార్షన్ చేసుకునే అధికారం మహిళలకు ఉందని తెలిపింది. ప్రతి భారతీయ స్త్రీ కి తనకు నచ్చినది ఎంచుకునే హక్కు ఉందని, కేవలం వివాహిత మహిళల లే శృంగారం చేయాలనే నిబంధన ఏమీ లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.