Ram Mandir Pran Pratishtha: నేడే రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ.. ఆ సమయమే కీలకం
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుక దాదాపు 500 ఏళ్ల నాటి హిందువుల కల. మరికొన్ని గంటల్లో అది సాకారం కానుంది.
By అంజి Published on 22 Jan 2024 12:53 AM GMTRam Mandir Pran Pratishtha: నేడే రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ.. ఆ సమయమే కీలకం
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుక దాదాపు 500 ఏళ్ల నాటి హిందువుల కల. మరికొన్ని గంటల్లో అది సాకారం కానుంది. బాల రామ చంద్రుడికి తన జన్మభూమిలో ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ క్రతువుకు సంబంధించి ఇప్పటకే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మహాకార్యాన్ని వీక్షించేందుకు అతిథులతో పాటు సాధువులు వేల సంఖ్యలో అయోధ్యపురికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12.20 నుంచి 1.00 గంటల మధ్యలో కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలోనే రామ మందిరాన్ని అందంగా ముస్తాబు చేశారు.
అయోధ్య రామ మందిరం విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది. ఆలయం లోపల, బయట పూలతో అలంకరించారు. మందిరం చుట్టు పక్కల కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 13 వేల మంది భద్రతా సిబ్బంది పహారా కాస్తుండగా.. అనుక్షణం పర్యవేక్షణ కోసం 10 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిరంతరం డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఆహ్వానం అందుకున్న అతిథులు ఒక్కొక్కరిగా రామ జన్మభూమికి చేరుకుంటున్నారు.
ప్రాణ ప్రతిష్ఠకు ఆ సమయమే కీలకం
అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు 84 సెకన్ల సమయం కీలకం కానుంది. మధ్యాహ్నం 12.29 గంటల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య శుభ ముహుర్తం ఉందని జ్యోతిషులు తెలిపారు. మేష లగ్నంలో అభిజిత్ ముహుర్తంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నేతృత్వంలో ఈ వేడుక జరగనుంది.