హాస్టల్‌ నుంచి 26 మంది బాలికలు మిస్సింగ్.. ఇద్దరు అధికారులు సస్పెండ్

మధ్యప్రదేశ్ పోలీసులు శనివారం భోపాల్‌లో అక్రమంగా నడుస్తున్న బాలల వసతి గృహం నుండి అదృశ్యమైన మొత్తం 26 మంది బాలికలను గుర్తించారు .

By అంజి  Published on  7 Jan 2024 10:16 AM IST
girls missing, Bhopal, shelter home, Madhya Pradesh

హాస్టల్‌ నుంచి 26 మంది బాలికలు మిస్సింగ్.. ఇద్దరు అధికారులు సస్పెండ్ 

మధ్యప్రదేశ్ పోలీసులు శనివారం భోపాల్‌లో అక్రమంగా నడుస్తున్న బాలల వసతి గృహం నుండి అదృశ్యమైన మొత్తం 26 మంది బాలికలను గుర్తించారు . ఈ కేసుకు సంబంధించి ఇద్దరు జిల్లా చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సిడిపిఓ)లను సస్పెండ్ చేయగా, మరో ఇద్దరికి నోటీసులు జారీ అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదంపూర్ చావ్నీ ప్రాంతంలో 10 మంది, మురికివాడల్లో 13 మంది, టాప్ నగర్‌లో ఇద్దరు, రైసెన్‌లో ఒకరు ఉన్నారు.

భోపాల్ శివార్లలోని పర్వాలియా ప్రాంతంలోని ఆంచల్ బాలికల హాస్టల్‌ను నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) చైర్మన్ ప్రియాంక్ కనుంగో గురువారం ఆకస్మికంగా సందర్శించినప్పుడు ఈ కేసు వెలుగులోకి వచ్చింది. షెల్టర్ హోమ్ రిజిస్టర్‌ను పరిశీలించిన తరువాత, కనుంగో అందులో 68 మంది బాలికల ఎంట్రీలు ఉన్నాయని, అయితే వారిలో 26 మంది కనిపించడం లేదని గుర్తించారు. బాలికలు గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల నుండి వచ్చారు.

తప్పిపోయిన బాలికలు 6 నుంచి 18 సంవత్సరాల లోపు వారని, వీరిలో కొందరు వీధుల్లో అనాథలుగా ఉన్నవారని, వారు వివిధ మతాలకు చెందిన వారైనా అందరికీ క్రైస్తవాన్ని నూరిపోస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళ పురుష గార్డులు విధులు నిర్వహిస్తున్నారని ప్రియాంక కనుగో ట్వీట్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇద్దరు చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సిడిపిఓ)లను శనివారం సస్పెండ్ చేశారు. అధికారులు, బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్, కోమల్ ఉపాధ్యాయ ఈ విషయంలో వారి నిర్లక్ష్యం కారణంగా సస్పెన్షన్‌కు గురయ్యారు. మహిళా శిశు అభివృద్ధి శాఖ అధికారి సునీల్ సోలంకి, ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాంగోపాల్ యాదవ్‌లకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Next Story