మీకు ఎస్‌బీఐ నుంచి క్రెడిట్‌ పాయింట్లను రిడీమ్‌ చేసుకోవాలని మెసేజ్‌లు వస్తున్నాయా.. తస్మాత్‌ జాగ్రత్త.. సైబర్‌ నేరగాళ్ల కొత్త పంథా

Alert For SBI Credit Card Holders.ఎస్‌బీఐ ఖాతాదారులను టార్గెట్‌ చేసుకుని కొందరు సైబర్‌ నేరగాళ్లు దాడులకు దిగుతున్నారు

By Medi Samrat  Published on  3 March 2021 5:31 AM GMT
SBI Credit Card Holders

ఇటీవల సైబర్‌ నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో ఏదో ఒక మూలాన ఉండి మన ఖాతాల్లో ఉన్న డబ్బులను క్షణాల్లో మాయం చేసేస్తున్నారు. తాజాగా ప్రముఖ ప్రభుత్వ బ్యాంకింగ్‌ సంస్థ ఎస్‌బీఐ ఖాతాదారులను టార్గెట్‌ చేసుకుని కొందరు సైబర్‌ నేరగాళ్లు దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో ఎస్‌బీఐ తన ఖాతాదారులను అలర్ట్‌ చేసింది. సైబర్‌ నేరగాళ్లు దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది. సైబర్‌ నేరగాళ్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇక సైబర్‌ నేరగాళ్లు ఈ సారి మరో కొత్త పంథాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఖాతాదారులకు ఎస్‌బీఐ పేరుతో రూ.9,870 విలువైన ఎస్‌బీఐ క్రెడిట్‌ పాయింట్లను రిడీమ్‌ చేసుకోవాలని హ్యాకర్లు అనుమానస్పద టెక్ట్స్‌ మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఈ మెసేజ్‌లో ఇచ్చిన ఓ లింక్‌ ద్వారా పాయింట్లను రిడీమ్‌ చేసుకోవాలని ఈ మెసేజ్‌ల అర్థం. అయితే మీరు పొరపాటున ఆ లింక్‌ను క్లిక్‌ చేసినా.. వెంటనే ఓ నకిలీ వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుందని. ఇక పాయింట్లను రిడీమ్‌ చేసుకోవడానికి మీరు పేరు, రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌, ఈ-మెయిల్‌, పుట్టిన తేదీ కార్డు నెంబర్‌, సీవీవీ, పిన్‌ వంటి వివరాలను ఎంటర్‌ చేయమని కోరుతుంది.

ఇలా మీరు ఈ సమాచారం అందిస్తారో లేదో అలా మీ ఖాతాలోని నగదు నేరగాళ్ల ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఈ విషయాలను న్యూ ఢిల్లీకి చెందిన సైబర్‌ పీస్ ఫౌండేషన్, సైబర్ సెక్యూరిటీ థింక్ ట్యాంక్ తెలిపింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్‌లో ఉండే ఎస్‌బీఐ కస్టమర్లను మోసగాళ్లు టార్గెట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. కాబట్టి.. ఎలాంటి మెసేజ్‌లు వచ్చినా వెంటనే స్పందించుకండా ఉండడమే బెటర్‌. అవసరం అనుకుంటే మీ నెట్‌ బ్యాంకింగ్‌ లాగిన్‌ అయి ఏవైనా పనులు చేసుకోవాలి తప్ప.. ఇలాంటి మెసేజ్‌ రూపంలో వచ్చిన లింక్‌లను ఓపెన్‌ చేయరాదని అధికారులు సూచిస్తున్నారు.

అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలా వెలుగు చూస్తున్నాయి. ఫోన్‌లలో మాయ మాటలు చెప్పి మోసం చేయడం, ఇలా మెసేజ్‌ల రూపంలో లింక్‌లను పంపి మోసం చేయడం లాంటివి ఎన్నో జరుగుతున్నాయి. అమాయకులను ఆసరా చేసుకునే నేరగాళ్లు ఇలా రకరకాల పంథాలతో నిలువునా మోసం చేస్తున్నారు. బీ కేర్‌ ఫుల్‌


Next Story