అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడిపోయిందో చెప్పిన‌ అఖిలేష్

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి లోక్‌స‌భ ఎన్నిక‌ల‌లో మంచి ఫ‌లితాల‌ను సాధించింది. 80 సీట్లకు గాను 43 స్థానాలను ఇండియా అలయన్స్ గెలుచుకుంది.

By Medi Samrat  Published on  6 Jun 2024 2:00 PM IST
అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడిపోయిందో చెప్పిన‌ అఖిలేష్

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి లోక్‌స‌భ ఎన్నిక‌ల‌లో మంచి ఫ‌లితాల‌ను సాధించింది. 80 సీట్లకు గాను 43 స్థానాలను ఇండియా అలయన్స్ గెలుచుకుంది. సమాజ్‌వాదీ పార్టీ ఒంటరిగా 37 సీట్లు గెలుచుకుంది. ఈ 37 స్థానాల్లో అయోధ్య రామ మందిరం ఉన్న‌టువంటి ఫైజాబాద్ లోక్‌స‌భ స్థానం కూడా ఉండ‌టం విశేషం. అక్క‌డ ఎస్పీ అభ్య‌ర్ధి అవ‌దేశ్ ప్ర‌సాద్‌ విజయం సాధించడం దేశ‌వ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచింది.

అయోధ్యలో సమాజ్‌వాదీ పార్టీ విజయంపై అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. నిజం ఏమిటంటే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎక్కువ సీట్లు కోల్పోయి ఉండేది. అయోధ్య ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు అయోధ్య ప్రజల బాధలను చూసి ఉంటారు. వారి భూమికి తగిన పరిహారం ఇవ్వలేదు. వారికి అన్యాయం జరిగింది. వారి భూమిని మార్కెట్ విలువకు తీసుకోలేదు. వారిపై తప్పుడు కేసులు పెట్టి.. బలవంతంగా వారి భూమిని లాక్కున్నారు. అందుకే అయోధ్య మరియు పరిసర ప్రాంతాల ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని నేను భావిస్తున్నానని అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు సమస్యల ప‌రిష్కారం కోసం ఓట్లు వేశారు. ప్రజా సమస్యలపై ఎన్నికలు జరిగాయి. యుపీలో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూసిందన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ల పొత్తు బీజేపీని మట్టికరిపించింది. కూటమి 80 స్థానాలకు గానూ 43 సీట్లు గెలుచుకోగా.. బీజేపీకి 33 సీట్లు మాత్రమే దక్కాయి.

బీజేపీ మిత్రపక్షం ఆర్‌ఎల్‌డీ రెండు స్థానాలు, అప్నాదళ్ ఒక స్థానంలో గెలుపొందాయి. ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్)కి కూడా ఒక సీటు లభించింది. 2014 లాగా ఈసారి కూడా బీఎస్పీ ఖాతా తెరవలేదు. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి వరుసగా మూడోసారి గెలుపొందగా.. రాహుల్ గాంధీ రాయ్ బరేలీ నుంచి, అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ నుంచి గెలుపొందారు.

స్మృతి ఇరానీ సహా కేంద్ర ప్రభుత్వంలోని ఏడుగురు మంత్రులు కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. బీజేపీ 47 మంది ఎంపీలకు మళ్లీ టిక్కెట్లు ఇవ్వగా.. వారిలో 26 మంది ఎన్నికల్లో ఓడిపోయారు.

Next Story