విమాన ప్రమాదంలో మరణించిన ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు గురువారం ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. బారామతిలోని విద్య ప్రస్థాన్‌లో జరగబోయే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ నేత నితిన్ నబీన్ తదితరులు హాజరౌతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అజిత్ దాదా కడసారి చూపు కోసం రాజకీయ నేతలు, అభిమానులు బారామతిలోని ఆయన నివాసం వద్దకు క్యూ కడుతున్నారు.
నిన్న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆయన మరణించారన్న వార్తను జీర్ణించుకోలేక యావత్ రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది. బుధవారం ఉదయం బారామతి ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. టేబుల్‌టాప్ రన్‌వేకు కేవలం 200 మీటర్ల దూరంలో ఆయన ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం అదుపుతప్పి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు విమానంలో ఉన్న మరో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిన్నటి నుంచి ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచగా, అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ దివంగత నేతకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు.